ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుంది. పర్యాటక ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ.. జల మార్గంలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ సంస్థల ప్రతిపాదనలకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రాష్ట్రంలో విజయవాడ బెర్మ్ పార్క్, శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు జోలాపుట్, లంబసింగి తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాలను సీ ప్లేన్ సేవల కోసం గుర్తించారు.
సీ ప్లేన్లు నీటిపై దిగేందుకు, ఎగిరేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వాటర్ డ్రోమ్‌కు దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నిర్మాణ పనులకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ త్వరలో టెండర్లు పిలవనుంది. మొదటగా పర్యాటకుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, శ్రీశైలం, విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక, కాకినాడ ప్రాంతాలు తొలి దశలో ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ప్రయోగాత్మక ప్రయాణం నిర్వహించారు. ఆ ట్రయల్ రన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీ ప్లేన్‌లో ప్రయాణించారు. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని రెగ్యులర్ సర్వీసులుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఉడాన్ పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సహకారం అందించనుంది. ప్రారంభ దశలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండి ఆపరేటర్లకు నష్టం వస్తే.. వీజీఎఫ్ ద్వారా కొంత మేరకు ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుంది.
దేశంలో ఇప్పటికే కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఉడాన్ పథకం కింద సీ ప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరనుంది. అంతేకాకుండా వాటర్ డ్రోమ్‌లను కేవలం సీ ప్లేన్ల కోసం మాత్రమే కాకుండా.. పర్యాటక బోట్ల నిర్వహణకు కూడా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీ ప్లేన్ సేవలు అందుబాటు లోకి వస్తే పర్యాటక ప్రాంతాల మధ్య వేగవంతమైన రవాణా ఏర్పడటంతో పాటు.. రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.