శ్రీనగర్: ‘వందేమాతరం’ పూర్తి గీతం ఆలాపన అంశం ఇప్పుడు ఇండియా కూటమిలో రాజకీయ విభేదాలకు కారణమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పూర్తి వెర్షన్ ‘వందేమాతరం’ ఆలపించగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా గౌరవంగా నిలబడ్డారు. సెప్టెంబర్ 7న ఎస్‌కేఐసీసీలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పూర్తి వెర్షన్ గీతం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న సమ్మిళిత, బహుళత్వ భావజాలంతో పూర్తిగా సరిపోదని అభిప్రాయపడ్డారు. కూటమి భాగస్వాములు తాము అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా కూడా ఈ అంశంపై స్పందిస్తూ జాతీయ గీతాలు, చిహ్నాలకు సంబంధించిన సంప్రదాయాలను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు.
The full version of Vande Mataram sits uneasily with the syncretic and pluralist ethos that our freedom fighters envisioned and nurtured for India.
For us, the considered judgment of Mahatma Gandhi, Pandit Nehru, Sardar Patel, Subhash Chandra Bose, Rajendra Prasad, Acharya… pic.twitter.com/VngmVUmevz
— K C Venugopal (@kcvenugopalmp) September 8, 2026
అయితే కాంగ్రెస్ వైఖరిని నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ గీతం విషయంలో తమ పార్టీకి ఎవరి నుంచి ఆదేశాలు అవసరం లేదని, ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని గౌరవించడం తమ నిర్ణయమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం కంటే ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌కు సూచించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుని కాంగ్రెస్‌పై ప్రశ్నలు సంధించారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని నేతలు ‘వందేమాతరం’ పూర్తి రూపం ఆలపించిన సందర్భాలను ప్రస్తావిస్తూ, శ్రీనగర్ ఘటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఈ పోస్ట్‌కు ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు తెలిపారు.
Jenab @TariqKarra Sb, please take a look at your congress CM’s and share your valuable thoughts with everyone. Thank you! https://t.co/5e3herjE87 pic.twitter.com/JEYjTLrmID
— Tanvir Sadiq (@tanvirsadiq) September 9, 2026
ఇదిలా ఉండగా, శ్రీనగర్‌లో జరిగిన ఈ వివాదం మధ్య ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జరుగుతున్న ఈ తొలి అంతర్జాతీయ జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 30కి పైగా దేశాల నుంచి 130కిపైగా చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్‌ను మళ్లీ అంతర్జాతీయ చిత్రీకరణ, సృజనాత్మక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి రాజకీయాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..