Headlines

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపే దౌత్య పావుగా భారత్‌.. మోదీ ఎండ్‌ గేమ్‌ ఏంటి?


రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై అప్పుడే నాలుగేళ్లు దాటింది. యుద్ధం ఆపాలని అమెరికా నుంచి ఐరోపా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ క్షిపణుల దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా కీవ్‌పై రష్యా దాడులు చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా రష్యాపై దాడులు చేస్తోంది. ట్రంప్‌ పుతిన్‌తో మాట్లాడుతున్నారు. అమెరికా బృందాలు మాస్కో, కీవ్‌ వెళ్లి చర్చలు జరుపుతున్నాయి. అయినా శాంతి మాత్రం ఇంకా దూరంగానే ఉంది.

యుద్ధం ఎక్కడ మొదలైంది?

రష్యా–ఉక్రెయిన్‌ గొడవ 2022తో మొదలుకాలేదు. 2014లో క్రిమియాను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలోనూ పోరు మొదలైంది. ఈ గొడవలు పెరుగుతూ వచ్చాయి. చివరకు 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దాడి మొదలుపెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ఈ పోరులో రష్యా, ఉక్రెయిన్‌ రెండు వైపులా భారీ నష్టం జరిగింది. CSIS అంచనా ప్రకారం 2026 జూన్‌ నాటికి రష్యా సైనిక నష్టాలు దాదాపు 14 లక్షలకు చేరాయి. ఇందులో 4 లక్షల నుంచి 4.5 లక్షల మంది వరకు మరణించి ఉండొచ్చని అంచనా. ఉక్రెయిన్‌ సైనిక నష్టాలు కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే రెండు దేశాలూ పూర్తి లెక్కలు బయటపెట్టకపోవడంతో ఖచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టం.

సైనికులతో పాటు సామాన్య ప్రజలూ ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి ధృవీకరించిన లెక్కల ప్రకారం 2026 ఆగస్టు నాటికి ఉక్రెయిన్‌లో కనీసం 16,874 మంది పౌరులు చనిపోయారు. 51,273 మంది గాయపడ్డారు. యుద్ధ ప్రాంతాల్లో అన్ని మరణాలను నమోదు చేయడం సాధ్యం కాకపోవడంతో వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

యుద్ధం దేశాన్నే మార్చేసింది

యుద్ధం అంటే తుపాకులు, బాంబులు మాత్రమే కాదు. ఒక దేశం మొత్తం దెబ్బతింటుంది. ఉక్రెయిన్‌లో ఇళ్లు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్‌ కమిషన్‌, ఉక్రెయిన్‌ ప్రభుత్వం చేసిన అంచనా ప్రకారం 2025 చివరి నాటికి ఉక్రెయిన్‌కు జరిగిన ప్రత్యక్ష నష్టం 195 బిలియన్‌ డాలర్లు దాటింది. దేశాన్ని మళ్లీ నిర్మించడానికి వచ్చే పదేళ్లలో దాదాపు 588 బిలియన్‌ డాలర్లు అవసరం కావచ్చని అంచనా.

ఆకాశంలోనూ భారీ నష్టం జరిగింది. రెండు దేశాలూ వందల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు కోల్పోయాయి. డ్రోన్లు పెద్ద సంఖ్యలో కూలిపోయాయి. ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు, ఇతర యుద్ధ సామగ్రి కూడా భారీగా ధ్వంసమైంది. అయితే ప్రస్తుతానికి రెండు వైపుల నష్టాలపై స్వతంత్ర లెక్కలు ఒకేలా లేవు.

శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు

యుద్ధం మొదలైన వెంటనే చర్చలు మొదలయ్యాయి. బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు మాట్లాడారు. 2022లో ఇస్తాంబుల్‌లోనూ చర్చలు జరిగాయి. కొన్ని అంశాలపై దగ్గరయ్యినా తుది ఒప్పందం మాత్రం కుదరలేదు.

నల్ల సముద్రం ద్వారా ధాన్యం ఎగుమతికి ఒప్పందం కుదిరింది. కొంతకాలం అది అమలైంది. తర్వాత ఆ ఒప్పందం ఆగిపోయింది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లోనూ శాంతి చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌ తన శాంతి ప్రణాళికను ముందుకు తెచ్చింది. 2025లో అమెరికా చొరవతో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. 2026లో జెనీవాలోనూ చర్చలు జరిగాయి. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం మళ్లీ పుతిన్‌, జెలెన్‌స్కీలను చర్చల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ భూభాగం, నాటో, భద్రతా హామీలు వంటి అంశాలపై రెండు దేశాల మధ్య ఇంకా పెద్ద తేడాలే ఉన్నాయి.

మాస్కో నుంచి కీవ్‌ వరకు మోదీ దౌత్యం

ఇక్కడే భారత్‌ పాత్ర కీలకంగా మారుతోంది. రష్యాతో భారత్‌కు దశాబ్దాల సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య బలమైన బంధం ఉంది. అదే సమయంలో అమెరికా, ఐరోపా దేశాలతోనూ భారత్‌ సంబంధాలు పెంచుకుంది. ఉక్రెయిన్‌తోనూ భారత్‌ సంబంధాలు కొనసాగిస్తోంది.

మోదీకి పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. జెలెన్‌స్కీతోనూ నేరుగా మాట్లాడుతున్నారు. 2024 జూలైలో మోదీ రష్యా వెళ్లారు. అదే ఏడాది ఆగస్టు 23న ఉక్రెయిన్‌ వెళ్లారు. ఉక్రెయిన్‌కు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రెండు దేశాల నేతలతోనూ మోదీ చెప్పిన మాట ఒక్కటే. యుద్ధంతో పరిష్కారం రాదని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని..

ఉక్రెయిన్‌ పర్యటన తర్వాత మోదీ పుతిన్‌తోనూ మాట్లాడారు. యుద్ధానికి త్వరగా ముగింపు రావాలని కోరారు. 2026 ఆగస్టు 31న కూడా పుతిన్‌తో మాట్లాడిన మోదీ, యుద్ధం ముగించాలని సూచించారు. సెప్టెంబర్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా భారత్‌ రష్యా, ఉక్రెయిన్‌ రెండింటితో నిరంతరం మాట్లాడుతోందని స్పష్టం చేశారు.

పుతిన్‌, జెలెన్‌స్కీ మోదీ మాట వింటారా?

ఇదే అసలు ప్రశ్న. మోదీ చెబితే పుతిన్‌ వెంటనే యుద్ధం ఆపేస్తారా? జెలెన్‌స్కీ కూడా వెంటనే అంగీకరిస్తారా? పరిస్థితి అంత సులభం కాదు. పుతిన్‌కు రష్యా భద్రత, భూభాగం, నాటో వంటి అంశాలు ముఖ్యం. జెలెన్‌స్కీకి తన దేశ భూభాగం, భద్రత ముఖ్యం. ఉక్రెయిన్‌ భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రష్యా కూడా తన డిమాండ్లను వదులుకునే స్థితిలో లేదు. అందుకే మోదీ చేతిలో యుద్ధాన్ని ఆపే రిమోట్‌ కంట్రోల్‌ లేదు. కానీ పుతిన్‌తో మాట్లాడే అవకాశం ఉంది. జెలెన్‌స్కీతోనూ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే భారత్‌కు ఉన్న అసలు బలం.

భారత్‌కు శాంతి దౌత్యం కొత్త కాదు

భారత్‌ గతంలోనూ యుద్ధాల మధ్య శాంతి ప్రయత్నాలు చేసింది. నెహ్రూ కాలంలో కొరియా యుద్ధంలో భారత్‌ కీలక పాత్ర పోషించింది. యుద్ధ ఖైదీల సమస్యపై చర్చల్లో భారత్‌ పాల్గొంది. 1953లో కొరియా కాల్పుల విరమణకు భారత దౌత్యం ఉపయోగపడింది.

1954లో ఇండోచైనా శాంతి ప్రక్రియలోనూ భారత్‌ భాగమైంది. వియత్నాం, లావోస్‌, కంబోడియాలో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించే అంతర్జాతీయ కమిషన్‌లో భారత్‌ పనిచేసింది. తర్వాత సూయజ్‌‌, కాంగో వంటి సంక్షోభాల్లోనూ భారత శాంతి బలగాలు పనిచేశాయి.

వాజ్‌పేయి హయాంలోనూ ఇదే ప్రయత్నం కనిపించింది. 1999లో లాహోర్‌కు బస్సులో వెళ్లి పాకిస్థాన్‌తో శాంతి చర్చలు జరిపారు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధం వచ్చినా దాన్ని ముగించేందుకు సైనిక చర్యతో పాటు దౌత్య ప్రయత్నాలు జరిగాయి. అంటే యుద్ధం వచ్చినప్పుడు ఒక పక్షం వైపు నిలబడకుండా, చర్చలకు దారి చూపడం భారత విదేశాంగ విధానంలో కొత్త విషయం కాదు.

మోదీ ఎండ్‌ గేమ్‌ ఏంటి?

మోదీ లక్ష్యం రష్యాను గెలిపించడం కాదు. ఉక్రెయిన్‌ను ఓడించడం కూడా కాదు. రెండు దేశాలతోనూ సంబంధాలు కొనసాగిస్తూ, అవసరమైన సమయంలో చర్చలకు వేదికగా నిలవడం. రష్యాతో భారత్‌కు రక్షణ, చమురు, వాణిజ్య బంధం ఉంది. అమెరికా, ఐరోపాతోనూ భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తోనూ సంభాషణ కొనసాగుతోంది. ఈ సమతుల్యతే భారత్‌కు బలం కానుంది.

అందుకే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ పాత్రను కేవలం మధ్యవర్తిత్వంగా చూడలేం. రెండు వైపుల తలుపులు తెరిచి ఉంచి.. అవసరమైనప్పుడు పుతిన్‌, జెలెన్‌స్కీలను చర్చల బల్ల దగ్గరకు తీసుకురావడమే భారత్‌ అసలు లక్ష్యం కావచ్చు.

ఇది మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఎండ్‌ గేమ్‌ కాదు. కానీ ఇప్పటివరకు భారత్‌ అనుసరిస్తున్న దౌత్యాన్ని చూస్తే ఇదే వ్యూహంగా కనిపిస్తోంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం. కానీ యుద్ధం ఆపే రోజు వచ్చినప్పుడు.. రష్యాతో మాట్లాడగలిగే, ఉక్రెయిన్‌ను ఒప్పించగల దేశంగా భారత్‌ ఉండనుంది.

-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *