Headlines

కాలువ దాటేందుకు వృద్ధుడినే ‘గుర్రం’గా మార్చిన అధికారి..! పట్వారీ తీరుపై తీవ్ర దుమారం


సిద్ధి: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాతా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఓ పట్వారీ, నీటితో నిండిన మురుగు కాలువను దాటేందుకు వృద్ధ గ్రామస్తుడి వీపుపై ఎక్కిన ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించి, సదరు పట్వారీని సస్పెండ్ చేసింది.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాతా హల్కా పట్వారీ నిలేష్ నామ్‌దేవ్ అని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ఏదో పనిమీద గ్రామానికి వచ్చిన సమయంలో మార్గమధ్యలో నీరు, బురదతో నిండిన కాలువ ఎదురైంది. ఈ క్రమంలో ఆయన స్వయంగా కాలువలోకి దిగకుండా, గ్రామానికి చెందిన వృద్ధుడు లాల్బా కేవత్ సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధుడి వీపుపై ఎక్కి కాలువను దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగి ఒక వృద్ధ గ్రామస్తుడితో ఇలా వ్యవహరించడం అమానవీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.

వీడియో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వికాస్ మిశ్రా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ బి.పి. పాండే మాతా గ్రామాన్ని సందర్శించి గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. వైరల్ వీడియో, ఫొటోలతో పాటు ప్రజా విచారణలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించారు. పట్వారీ ప్రవర్తన సున్నితత్వం లేనిదిగా, అగౌరవంగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1966లోని రూల్ 9 కింద నిలేష్ నామ్‌దేవ్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.

Sidhi Collector Action

Sidhi Collector Action

అంతేకాకుండా ప్రభుత్వ భూముల లీజులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కులం, జనన ధృవీకరణ పత్రాల జారీ వంటి సేవలకు డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలను కూడా గ్రామస్థులు విచారణ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆరోపణల నిజానిజాలు కూడా విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి అదనపు కలెక్టర్ సమర్పించే విచారణ నివేదికపైనే ఉంది. నివేదిక ఆధారంగా పట్వారీపై మరిన్ని క్రమశిక్షణా లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *