Headlines

వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!


సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు కేవలం మనుషులపైనే కాకుండా, పాడి పశువులు మరియు జీవాలపై కూడా దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా సదాశివపేట మండలం ముబారక్‌పూర్ (ఎ) గ్రామంలో వీధి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఒక ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన స్థానిక రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ముబారక్‌పూర్ (ఎ) గ్రామానికి చెందిన రైతు మన్నే సత్తయ్య తన పొలం పనుల నిమిత్తం వారం రోజుల క్రితమే ఎంతో ఆశగా ఒక ఎద్దును కొనుగోలు చేశారు. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న సమయంలో, రెండు రోజుల క్రితం గ్రామంలోని వీధి కుక్క ఆ ఎద్దును తీవ్రంగా కరిచింది. గాయపడిన ఎద్దుకు వెంటనే వైద్య సహాయం అందించి చికిత్స చేయించినప్పటికీ, గాయాల తీవ్రత వల్ల పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందింది.

ఎంతో కష్టపడి, కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఎద్దు వారం తిరక్కముందే ఇలా కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో రైతు సత్తయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనంతరం మృతి చెందిన ఎద్దును తన పొలానికి తీసుకెళ్లి కంటతడి పెడుతూ అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి



ఈ ఘటనతో ముబారక్‌పూర్ (ఎ) గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో దాదాపు 100 వరకు వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వీధి వీధినా కుక్కల గుంపులు చేరి రాకపోకలు సాగించే వారిపై పడుతున్నాయని, భయంతో బయటకు రాలేకపోతున్నామని చెబుతున్నారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు వీధుల్లో కట్టేసే పాడి పశువులకు ఈ కుక్కల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందనే భయం వ్యక్తమవుతోంది. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పల్లెల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మండల అధికారులు తక్షణమే స్పందించి ముబారక్‌పూర్ (ఎ) గ్రామంలో కుక్కల బెడదను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, అలాగే నష్టపోయిన రైతు మన్నే సత్తయ్యను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *