Headlines

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!


హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

పిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జనవరిలో ఇరాన్‌లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో పాటు కొందరికి మరణశిక్షలు కూడా విధించింది.

ఈ క్రమంలోనే 19 ఏళ్ల కవల సోదరీమణులకు ఇరాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన శిక్షలు ఖరారు చేసింది. జైల్లో వారిపై సాగించిన దారుణ హింస ఎంతలా ఉందంటే, చిత్రహింసల కారణంగా కనీసం తమ సొంత కూతుళ్లను కూడా వారి తల్లి గుర్తుపట్టలేకపోయారు. ఇరాన్ పాలకుల ఈ అణచివేత చర్యలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్ కోర్టు దారుణ శిక్షలు!

 నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో 19 ఏళ్ల కవల సోదరీమణులకు కోర్టు దారుణమైన శిక్షలు ఖరారు చేసింది.  తరనే రహీమికి మరణశిక్ష విధించగా, ఆమె కవల సోదరి రొమినా రహీమికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. వీరు అరెస్టయ్యే నాటికి ఇంకా హైస్కూల్ విద్యార్థినులే కావడం గమనార్హం. ‘ది గార్డియన్’ కథనం ప్రకారం.. ఈ అరెస్ట్ వెనుక అత్యంత భయానక వాతావరణం నెలకొంది.

ఒళ్లంతా గాయాలు.. కూతుళ్లను గుర్తుపట్టలేని తల్లి

మే నెలలో కూతుళ్లను కలుసుకునేందుకు తల్లికి అనుమతి లభించింది. అయితే, జైలు అధికారులు పెట్టిన చిత్రహింసల కారణంగా ఒళ్లంతా గాయాలతో, ముఖం వాచిపోయి వికృతంగా మారిన తమ బిడ్డలను కనీసం ఆ కన్నతల్లి కూడా మొదట గుర్తుపట్టలేకపోయింది. జైలులో ఆ కవల సోదరీమణులపై సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. వారి మోచేతులు, వేళ్ల కణుపులు, కాళ్లు విరగొట్టడమే కాకుండా జుట్టును దారుణంగా పీకారు. జైలు సిబ్బంది వారిని జుట్టు పట్టుకుని ఒక గది నుంచి మరో గదికి ఈడ్చుకెళ్లారని, అంతేకాకుండా వారిని ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంత నిర్బంధంలో (సాలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారని అమెరికాలోని యుటాలో ఉంటున్న వారి బంధువు మసూద్ నూర్మహమ్మది ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో సొంతంగా ఒక గుర్రపుశాల నడపాలని కలలు కన్న తరనే జీవితం ఇప్పుడు జైలు గోడల మధ్య అంధకారంగా మారింది. కోర్టులో విచారణ సందర్భంగా తరనే మాట్లాడుతూ, తనపై జరిగిన చిత్రహింసలను బయటపెట్టింది. తనతో బలవంతంగా తప్పు ఒప్పుకోమని అంగీకార పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆమె ధైర్యంగా కోర్టుకు వెల్లడించింది. తరనే కనుక తాము చెప్పినట్లు సంతకం చేయకపోతే, ఆమె కళ్ల ముందే ఆమె సోదరి రొమినాపై అత్యాచారం చేస్తామని జైలు గార్డులు  బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ సమయంలో ఆ సోదరీమణుల తల్లిని కోర్టులోకి అస్సలు అనుమతించలేదు. అసలు ఎలాంటి పారదర్శకత లేకుండా రహస్యంగా ఈ తతంగం నడిపించారు. ఆ సోదరీమణుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలన్నీ తీవ్రమైన చిత్రహింసలు పెట్టి బలవంతంగా సేకరించినవేనని వారి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నిరసనల సమయంలో వీరిద్దరూ ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అంతేకాదు, వీరు అంతకుముందు ఎప్పుడూ ఎలాంటి రాజకీయ నిరసనల్లోనూ పాల్గొనలేదని, పూర్తిగా చదువుకునే హైస్కూల్ విద్యార్థినులని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనల పేరుతో ఇరాన్ దారుణాలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం 500 మంది పై మరణశిక్షలు అమలు చేసింది. అందులో కనీసం 29 మంది జనవరి నెలలో జరిగిన నిరసనలతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం.  ఈ మరణశిక్షలకు గురైన వారిలో కనీసం 16 మంది మహిళలు ఉండటం ఇరాన్‌లో హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

వందలాది మందికి మరణశిక్షలు

మరోవైపు, వందలాది మంది నిరసనకారులు మరణశిక్షలను లేదా ప్రాణాలు తీసే తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒక్క ఇస్ఫహాన్‌ నగరంలోనే ఇలాంటి కేసులు 70కి పైగా నమోదయ్యాయి.  ఇరాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ అరాచక మరణశిక్షలను బ్రిటన్‌తో పాటు మరో 30 దేశాలు తీవ్రంగా ఖండించాయి. మానవ హక్కులను కాలరాస్తున్న ఇరాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన గళాలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *