Headlines

El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..


El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..

సాధారణంగా వానకాలం సీజన్‌లో ఈ సమయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చని పైర్లతో కళకళలాడాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాల్లో నీటి కొరత మొదలైంది. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన మడి, ఇవాళ తడారిపోయి కనిపిస్తోంది. ఒక్కో మడి చొప్పున ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.

సాగు విస్తీర్ణం తగ్గినా.. పెరిగిన అన్నదాతల కష్టాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాన కాలంలో19.41 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది రాష్ట్రంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాధారణంగా వరి 10 లక్షల నుండి 11 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితులతో బోరు బావుల కింద ఏడు లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు 8 లక్షల నుండి 8.5 లక్షల ఎకరాలకు పైగా ఉండగా.. ఈ సారి అది ఆరు లక్షలకు పడిపోయింది. కానీ సాగు విస్తీర్ణం తగ్గినా రైతులకు మాత్రం కష్టాలు పెరిగాయి. సీజన్ ప్రారంభమై నాలుగు నెలలైనా తీర వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా పొట్ట దశకు చేరుకున్న వరికి ఇప్పుడు నీరు అత్యవసరం. ఇదే సమయంలో వర్షం ముఖం చాటేయడం.. బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

బోర్లు వట్టి.. బావులు బోసి..

కరువు ప్రభావానికి అసలు అద్దం పట్టేది భూగర్భజలాల పరిస్థితి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న బోర్లు కూడా అడపాదడపా మాత్రమే నీటిని ఇస్తుండగా.. కొన్ని పూర్తిగా వట్టిపోతున్నాయి. బోరు నీటిపై ఆధారపడి సాగు చేసిన వరిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నీటి కోసం ఒక బోరు నుంచి మరో బోరుకు. ఒక బావి నుంచి మరో బావికి పరుగులు పెడుతున్నారు. బావులను పూడిక తీయడంతో పాటు కొత్త బోర్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. దీంతో రైతులు ఆ పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. వరి పొలాలు ఎండిపోతుండడంతో పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయనీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పత్తికీ తప్పని ఎండల సెగ..

వరి పరిస్థితి ఇలా ఉంటే.. పత్తి రైతుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంది. వాన కాలంలో ఉష్ణోగ్రతలు ఎండా కాలాన్ని తలపిస్తోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. సమయానికి తేమ అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులకు.. ఇంకో వర్షం వస్తే పంట నిలబడుతుంది.. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందనీ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *