చావుబతుకుల మధ్య అత్యవసర స్థితిలో వచ్చిన ఓ బాలుడికి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. మానసిక సమస్యలతో నాలుగు పదునైన బ్లేడు ముక్కలను మింగేసిన బాలుడికి.. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా కేవలం అత్యాధునిక ఎండోస్కోపీ విధానం ద్వారా ఆ ముక్కలను బయటకు తీసి తమ అద్భుత వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల కారణంగా ఇటీవల విచక్షణ కోల్పోయి నాలుగు బ్లేడు ముక్కలను మింగాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఒక్కసారిగా తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర అస్వస్థత తలెత్తడంతో కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. పరిస్థితి విషమించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు.
అప్రమత్తమైన వైద్యులు వెంటనే బాలుడికి ఎక్స్‌రే, అత్యవసర స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వైద్యులు విస్తుపోయే నిజం బయటపడింది. బాలుడి జీర్ణాశయంలో మూడు బ్లేడు ముక్కలు ఉండగా, మరొక పదునైన ముక్క అప్పటికే జీర్ణాశయాన్ని దాటి పేగుల వైపునకు జారినట్లు గుర్తించారు. చిన్న కదలిక వచ్చినా లోపలి అవయవాలు తెగిపోయి, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.
ఈ క్రమంలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బి. రమేశ్‌కుమార్ నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం రంగంలోకి దిగింది. సాధారణంగా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కడుపు కోసి ఓపెన్ సర్జరీ చేస్తుంటారు. కానీ బాలుడి చిన్న వయస్సును, శస్త్రచికిత్స వల్ల కలిగే తీవ్ర నష్టాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సర్జరీ లేకుండా అత్యాధునిక అప్పర్ జీఐ ఎండోస్కోపీ పద్ధతి ద్వారానే బ్లేడులను తొలగించాలని నిశ్చయించారు.
అన్నవాహిక, జీర్ణాశయపు సున్నితమైన గోడలకు ఎక్కడా చిన్న గీత కూడా పడకుండా అంతర్గత రక్తస్రావం కాకుండా వైద్యులు ప్రత్యేక వైద్య పరికరాల సాయంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించారు. కడుపులో ఉన్న బ్లేడు ముక్కలను ఒక్కొక్కటిగా ఎండోస్కోపీ ద్వారా సురక్షితంగా బయటకు తీశారు. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్ బి. రమేశ్‌కుమార్ వెల్లడించారు. సమయస్ఫూర్తితో శ్రమించి తమ బిడ్డకు ప్రాణదానం చేసిన ఉస్మానియా వైద్యుల బృందానికి బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.