Headlines

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఊహించని ట్విస్ట్.. సౌత్ జోన్‌లోకి ఇద్దరు టీమిండియా స్టార్ల ఎంట్రీ


Duleep Trophy 2026: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు ముందు సౌత్ జోన్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడి వచ్చిన స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, బ్యాటర్ దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చారు. వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఇద్దరు స్టార్ల ప్రాతినిధ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి ఈస్ట్ జోన్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం సౌత్ జోన్ స్క్వాడ్‌ను మరింత బలోపేతం చేశారు. శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ జట్టులో చేరినట్లు క్రిక్‌ఇన్ఫో నివేదించింది. వీరిద్దరి చేరికతో సౌత్ జోన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలు మరింత బలంగా మారాయి. కేఎల్ రాహుల్ కూడా ఈ ఫైనల్లో ఆడతాడని ప్రచారం జరిగినప్పటికీ, అతడి పాల్గొనడంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్, ఆ జట్టు వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫైనల్ మ్యాచ్ ఆడటంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ వీరిని టి20 సిరీస్ ప్రాక్టీస్ క్యాంప్ కోసం ఢిల్లీకి త్వరగా రమ్మంటే గనుక ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

భారత టి20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడటానికే సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. సెమీఫైనల్ ముగిసిన తర్వాత తిలక్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 10న ముగుస్తుందని, అఫ్గాన్ సిరీస్ సెప్టెంబర్ 13న ఉన్నందున మధ్యలో రెండు రోజుల వ్యవధి లభిస్తుందని తెలిపాడు. సెప్టెంబర్ 11న ఢిల్లీ క్యాంప్‌లో చేరి ఒక రోజు ప్రాక్టీస్ చేసినా టి20 మ్యాచ్ ఆడేందుకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాడు.

శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టుకు సుదీర్ఘ విరామం లభించింది. ఈ నేపథ్యంలో సిరాజ్, పడిక్కల్‌లను దులీప్ ట్రోఫీ ఫైనల్లో దించడం వెనుక సెలెక్టర్ల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు మ్యాచ్ రిథమ్ కోల్పోకుండా ఉండటానికే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. మైదానంలో నిలకడగా రాణించేందుకు రెడ్ బాల్ క్రికెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *