Headlines

మీసాల కృష్ణుడి ఆలయం.. తెలంగాణలో ఎక్కడ ఉందంటే..?


శ్రీకృష్ణుడు అనగానే మన కళ్ల ముందు నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై అందమైన చిరునవ్వుతో కూడిన దివ్యరూపం కనిపిస్తుంది. కానీ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని చెల్లాపూర్‌లో మాత్రం కృష్ణుడు అందుకు భిన్నమైన రూపంలో దర్శనమిస్తాడు. కోరమీసాలతో భక్తులకు దర్శనమిచ్చే ఈ వేణుగోపాలస్వామి ప్రత్యేకత వెనుక దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో కొలువైన ఈ స్వామిని భక్తులు ‘మీసాల కృష్ణుడు’, ‘మీసాల వేణుగోపాలస్వామి’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. సాధారణంగా వేణుగోపాలుడి విగ్రహం ప్రశాంతమైన ముఖంతో, వేణువు ధరించిన రూపంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడి కృష్ణుడి ముఖంపై కనిపించే కోరమీసాలు స్వామివారికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అసలు కృష్ణుడికి మీసాలేంటి? ఈ ప్రత్యేక రూపం ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానంగా స్థానికంగా ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది.

600 ఏళ్ల నాటి కథ..

సుమారు 600 ఏళ్ల క్రితం చెల్లాపూర్ ప్రాంతం దొరల పాలనలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో ప్రజలపై పన్నులు, శిస్తుల భారం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారట. తమ గ్రామానికి మంచి జరగాలని, ప్రజలకు మేలు కలగాలని భావించిన గ్రామ పెద్దలు వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఆలయ నిర్మాణం పూర్తయినా.. స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత మాత్రం గ్రామస్తులకు లేకపోయిందట. దీంతో ఎక్కడైనా ఉన్న వేణుగోపాలస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన ఆలయంలో కృష్ణుడి విగ్రహం ఉన్నట్లు గుర్తించారట. రాత్రివేళ ఎడ్లబండ్లపై ఆ విగ్రహాన్ని చెల్లాపూర్‌కు తరలించే ప్రయత్నం చేశారట. అయితే విగ్రహం కనిపించకపోవడంతో రాజగోపాలపేట గ్రామస్తులు దాని కోసం వెతుక్కుంటూ చెల్లాపూర్ వరకు వచ్చారని స్థానిక కథనం. దీంతో చెల్లాపూర్ వాసులు విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారట.

మీసాలు ఎలా వచ్చాయంటే..

ఆ తర్వాతే అసలు కథ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే.. అది తమ గ్రామానికి చెందినదని రాజగోపాలపేట వాసులు గుర్తించే అవకాశం ఉందని భావించిన చెల్లాపూర్ గ్రామస్తులు, విగ్రహ రూపంలో కొన్ని మార్పులు చేశారట. కృష్ణుడి తలపై ఉన్న కొప్పును తొలగించి దాని స్థానంలో కిరీటాన్ని ఏర్పాటు చేశారట. అంతేకాదు.. స్వామివారి ముఖానికి వెండి మీసాలను అమర్చారట. ఇలా రూపంలో మార్పులు చేసిన అనంతరం ఆ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారని కథనం. అప్పటి నుంచి చెల్లాపూర్ వేణుగోపాలస్వామి ‘మీసాల కృష్ణుడు’గా గుర్తింపు పొందారని స్థానికులు చెబుతున్నారు.

నేటికీ కోరమీసాలతో దర్శనమిచ్చే ఈ కృష్ణుడిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఆలయానికి వస్తుంటారు. ఆరు శతాబ్దాల నాటి ఈ ప్రత్యేక రూపం వెనుక నిజమెంత? స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ఎంతవరకు వాస్తవం? అన్నది పక్కన పెడితే.. మీసాలతో ఉన్న వేణుగోపాలుడి రూపం మాత్రం చెల్లాపూర్ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *