Headlines

మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి.. నేపాల్ డిమాండ్ !  


Justice Not Aid India, China, Us Have Responsibility Nepal Minister Shishir Khanal On Floods

ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న చైనా, అమెరికా, భారత్ దేశాలే తమ ప్రస్తుత విపత్తుకు చారిత్రక బాధ్యత వహించాలని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ స్పష్టం చేశారు. గ్లోబల్ వార్మింగ్ సృష్టిస్తున్న వినాశనంలో నేపాల్ పాత్ర నామమాత్రమే అయినప్పటికీ, పర్యావరణ సంక్షోభం తాలూకు  మూల్యాన్ని తమ దేశం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం మానవతా దృక్పథంతో ఇచ్చే విరాళాలు లేదా సహాయం కాదని, అభివృద్ధి చెందిన పెద్ద దేశాల నైతిక, చట్టపరమైన బాధ్యత అని నేపాల్ అంటోంది. ఈ వైపరీత్యంపై ఐక్యరాజ్యసమితిలోని లాభనష్టాల నిధి (Loss and Damage Fund) ద్వారా అధికారికంగా నష్టపరిహారం కోరడంతో పాటు, అంతర్జాతీయ వేదికలపై ఈ డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపించాలని ఆ దేశం భావిస్తోంది.

సాధారణ వర్షం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ప్రజలకు ముందస్తు హెచ్చరిక అందలేదనీ నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.  ఈ పెను విపత్తును  ‘క్యాటస్ట్రాఫిక్‌ మౌంటెన్‌ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతం అవుతోందని దీని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

‘సాయం’ కాకుండా ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్ళిస్తాం

ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయమని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై వాతావరణ విపత్తులపై తమ దౌత్య విధానాన్ని ‘సాయం’ కాకుండా ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తామని తెలిపారు. ఇది దాతృత్వం కాదని, చట్టపరమైన, నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తామని చెప్పారు.

గ్లోబల్ కార్బన్ బడ్జెట్ గణాంకాల ప్రకారం, కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా దాదాపు 32 శాతంగా ఉంది. అమెరికా వాటా 13 శాతం కాగా, భారత్ వాటా 8 శాతంగా నమోదైంది. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ శిలాజ ఇంధన (ఫాసిల్) కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం విడుదల చేస్తున్నాయి. ప్రపంచ దేశాల మొత్తం ఉద్గారాల్లో నేపాల్ వాటా కేవలం 0.04 శాతం మాత్రమే ఉంది.

చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్‌కు పరిహారం చెల్లించాలనే నిర్దిష్టమైన చట్టం లేదా నిబంధన ప్రస్తుతం లేదు. ఇది కేవలం నేపాల్ తెరపైకి తెచ్చిన ‘క్లైమేట్‌ జస్టిస్‌ – లాస్‌ అండ్‌ డ్యామేజ్‌’ వాదన మాత్రమే. తక్కువ ఉద్గారాలు విడుదల చేసే దేశాలే వాతావరణ విపత్తులతో తీవ్రంగా నష్టపోతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అత్యధిక కార్బన్ రిలీజ్ చేస్తున్న దేశాలు ఆర్థిక బాధ్యత వహించాలనే నేపాల్ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *