Headlines

బీజేపీ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపేందుకు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందని, కానీ తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, వైఫల్యాలను ప్రశ్నించినందుకు, జవాబుదారీతనం కోరినందుకు ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నారంటూ కేంద్ర మంత్రి మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి నల్గొండకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ బీజేపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం అత్యంత శోచనీయమని అన్నారు. కేవలం బాధితులను పరామర్శించడానికి వెళ్లినందుకే బీజేపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచాలా? వారిని ప్రజలను కలవకుండా అడ్డుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా, ప్రశ్నలు అడిగిన వారినే అరెస్టు చేస్తున్నారు, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి పోలీసులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి జరిగినప్పుడు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నప్పుడు, బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేస్తూ, దాడులు చేసిన వారిని స్వేచ్ఛగా వదిలేయడం ఏం న్యాయమని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. దాడులు ఎవరు చేశారో, బాధితులు ఎవరో, అధికారాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో వారికి బాగా తెలుసని, తెలంగాణ తన చరిత్రలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు సాక్ష్యంగా నిలిచిందని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం నిలబడిన ఈ గడ్డపై అక్రమ అరెస్టుల ద్వారా ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని తెలిపారు. బీజేపీ నాయకులను ఎన్నిసార్లు అరెస్టు చేసినా, నిర్బంధంలో ఉంచినా, ప్రజల కోసం మా పోరాటం ఆగదని, ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం, అన్యాయాన్ని బహిర్గతం చేయడం, బాధితులకు అండగా నిలబడటం తమ బాధ్యత అని అన్నారు.

పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కేయగలమని ప్రభుత్వం భావిస్తే, అది తీవ్రంగా పొరబడుతున్నట్లే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయాధికారులు ప్రజలే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజల హక్కులను కాపాడటానికి, బాధితులకు అండగా నిలబడటానికి బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఎంతటి నిర్బంధం లేదా అణచివేత కూడా ప్రజల కోసం మా పోరాటాన్ని ఆపలేవు అంటూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *