Headlines

Hyderabad: వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి విచారించగా..


Hyderabad: వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి విచారించగా..

నగరంలో అక్రమంగా హ్యాష్‌ అయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతానికి చెందిన పొద్దు మోహన్‌రావు (41), డుంబ్రిగుడ మండలం పాతలంగి గ్రామానికి చెందిన టి. బిస్తుదాస్‌ (27)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోహన్‌రావు వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ దందాలోకి అడుగుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్‌ చేశాడు.

మోహన్‌రావు తనకు పరిచయమైన బిస్తుదాస్‌తో కలిసి ఈ నెల 30న ఒడిశాకు వెళ్లి 1.710 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేశారు. అనంతరం ఆగస్టు 31న తెల్లవారుజామున మూడు గంటలకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైలు ఎక్కారు. సికింద్రాబాద్‌ చేరుకున్న తర్వాత ఆటోలో ఎస్‌ఆర్‌ నగర్‌లోని వాటర్‌ ట్యాంక్‌ లైన్‌ ప్రాంతానికి వెళ్లి కొనుగోలుదారుడి కోసం ఎదురుచూస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి హ్యాష్‌ ఆయిల్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఛత్రపతి యాదేందర్‌, జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ డి. రవి రాజ్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. వివరాలను కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గాయక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ఐపీఎస్‌ వెల్లడించారు.

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్‌ దందాలోకి దిగితే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *