Headlines

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం! వీడియో


హైదరాబాద్‌, ఆగస్ట్ 31: హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలో నలుగురు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో కాలనీలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు.. అనుమానాస్పదంగా ఇళ్ల చుట్టూ తిరుగుతూ చోరీకి అనువైన ఇళ్ల కోసం గాలించారు.
ముందుగా ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడ విలువైన వస్తువులు ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటిని టార్గెట్‌ చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు గోడ దూకడానికి ప్రయత్నించారు. అయితే దొంగల కదలికలను గమనించిన ఇంట్లోని మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. దీంతో ఒక్కసారిగా భయపడిన దుండగులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

అయితే అంతటితో ఆగకుండా దొంగలు కొంతసేపు కాలనీలోనే తిరుగుతూ చోరీకి మరోసారి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీలో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. తమ కాలనీలో రాత్రి వేళల్లో భద్రతను మరింత పెంచాలని పోలీసులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి



ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురు దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలోనూ ఇదే ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు స్థానికులకు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *