Headlines

20 ఏళ్ల పగ.. టీ తాగేందుకు రోడ్డుపైకి రాగానే కత్తులతో దాడి! పట్టపగలే దారుణ హత్య


గుంటూరులోని కెవిపి కాలనీ.. ఉదయం పది గంటల సమయంలో టీ తాగేందుకు చిన్నా రోడ్డుకు మీదకు వచ్చాడు. అతను రావడాన్ని గమనించిన కొంతమంది బైక్‌పై వెంటపడ్డారు. మొదట కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తులతో నరికి చంపేశారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చిన్నా కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అనుకున్నంతా పనిచేశారు అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు హత్య జరిగిందంటే…

కెవిపి కాలనీకి చెందిన చిన్నా ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడే నివసించే వాడు. అదే కాలనీకి చెందిన బుల్లయ్య .. చిన్నా భార్యతో చనువుగా ఉంటున్నాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్దీ రోజులకే బుల్లయ్య హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది చిన్నానే అని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు తర్వాత కాలంలో కొట్టేయడం జరిగింది. అయితే తన భార్యకు విడాకులిచ్చిన చిన్నా మరొక వివాహం చేసుకొని తన మకాం మంగళగిరికి మార్చాడు. అక్కడికి కూడా బుల్లయ్య కుటుంబ సభ్యులు వచ్చి చిన్నాను టార్గెట్ చేసినట్లు సమాచారం అందండంతో అక్కడ నుండి తెలంగాణలోని సూర్యాపేటకు మకాం మార్చాడు. అక్కడే గత ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అయితే చిన్నా కోసం బుల్లయ్య కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.

రెండు రోజుల క్రితం కెవిపి కాలనీలో ఉండే చిన్నా బాబాయ్ చనిపోయినట్లు సమాచారం అందింది. దీంతో చిన్నా కచ్చితంగా వస్తాడని భావించిన బుల్లయ్య కుటుంబ సభ్యులు పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. బాబాయ్ మృతదేహాన్ని చూసిన తర్వాత.. చిన్నా టీ తాగేందుకు రోడ్డుకుపైకి వచ్చాడు. అదే సమయంలో ప్రత్యర్థులు కత్తులతో నరికి హత్య చేశారు. పట్టపగలే దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఎదురు చూసిన బుల్లయ్య కటుంబ సభ్యులు.. చిన్నాను హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *