Headlines

డబ్బుల కోసం హోటల్లో వెయిటర్‏గా పనిచేశా.. చిరంజీవి, రజినీకాంత్ నా క్లాస్ మేట్స్.. టాలీవుడ్ నటుడు..


అగ్రశ్రేణి నటుడు, పలు భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాజర్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఎప్పుడూ నటుడు కావాలని కలలు కనలేదని, తన జీవితంలో ఎదురైన ఆర్థిక సవాళ్లే ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణమని ఆయన స్పష్టం చేశారు. నాజర్ దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నెలకు కనీసం కొంత ఆదాయం వస్తే చాలు అని కోరుకునేవాడినని ఆయన తెలిపారు. 1975-1982 ప్రాంతంలో 400 రూపాయల నెలవారీ ఆదాయం కూడా తనకెంతో గొప్పగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. నటుడిగా మారమని తన తండ్రి బలవంతం చేశారని, “ఎందుకు నన్ను నటుడిని చేశారు?” అని ఇప్పటికీ తన తండ్రితో వాదిస్తూ ఉంటానని నాజర్ చమత్కరించారు. మొదట్లో నటన అనేది కేవలం ఒక వృత్తి మాత్రమేనని, డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగానే చూశానని ఆయన పేర్కొన్నారు.

తన ప్రారంభ జీవితంలో ఆర్థిక స్థిరత్వం కోసం పలు రకాల ఉద్యోగాలు చేశానని నాజర్ వెల్లడించారు. ముఖ్యంగా 1979 నుండి 1982 వరకు మూడేళ్ల పాటు చెన్నైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ అయిన తాజ్ కోరమాండల్‌లో వెయిటర్‌గా పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నటుడు కావాలంటే చెన్నైకి రావడం తప్పనిసరని, అక్కడ జీవనం గడపడానికి కనీసం 100 రూపాయల నెలవారీ ఖర్చు అవసరమని, అందుకే ఆ ఉద్యోగాలు చేశానని వివరించారు. యాక్టింగ్ రంగంలోకి ప్రవేశించడానికి ఒక మలుపు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం. అప్పటికి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలు చెన్నైలోనే నిర్మించబడేవి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తర్వాతే నటన అంటే కేవలం డైలాగ్‌లు చెప్పడం, డ్యాన్స్ చేయడం లేదా ఫైట్స్ చేయడం మాత్రమే కాదని, అది ఒక లోతైన, మానసికంగా సంక్లిష్టమైన కళ అని తనకు అర్థమైందని నాజర్ పేర్కొన్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో రజినీకాంత్ తనతో పాటు ఉన్నారని, చిరంజీవి గారు కూడా తన బ్యాచ్‌మేట్‌ అని, కాకపోతే వారు తెలుగు క్లాస్‌లో, తాను తమిళ క్లాస్‌లో ఉండేవాడినని ఆయన వివరించారు.

ఇన్‌స్టిట్యూట్ తర్వాత కూడా నటన గురించి మరింత లోతుగా నేర్చుకోవడానికి నాజర్ ప్రయత్నించారు. అప్పట్లో చెన్నైలో ప్రయోగాత్మక నాటకాలు, సమకాలీన డ్రామాలు విస్తృతంగా ప్రదర్శితమయ్యేవి. వాటిలో పాల్గొనడం, వర్క్‌షాప్‌లకు హాజరవడం ద్వారా తన నటనకు పదును పెట్టుకున్నారు. రామనుజం, ముత్తుస్వామి వంటి గొప్ప గురువుల వద్ద శిక్షణ పొందడం తనకు ఎంతో ఉపయోగపడిందని ఆయన కృతజ్ఞతగా స్మరించుకున్నారు. తరువాత దూరదర్శన్‌లో కొన్ని సీరియల్స్, నాటకాలలో నటించే అవకాశం లభించింది. ఇదే ఆయన సినీ ప్రస్థానానికి తొలి మెట్టు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తన మొదటి చిత్రమైన “కల్యాణ అగదిగళ్”లో అవకాశం ఇవ్వడంతో నాజర్ వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత తన ఐదవ చిత్రం “నాయగన్” తన కెరీర్‌కు ఒక పెద్ద మలుపుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *