నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా మటన్, చికెన్ వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ, వీటన్నింటికంటే చేపలు, రొయ్యల్లో అత్యధిక పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశంలో చేపల వినియోగం చాలా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారతీయులు సగం మాత్రమే తింటున్నారు. వాస్తవానికి చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్కువ కొవ్వును అందిస్తూ, మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఏటా కనీసం 18 కిలోల చేపలను ఆహారంగా తీసుకోవాలి.. ఇది తప్పనిసరైతే కాదు.. అంత వరకు తీసుకుంటే.. మంచిదని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి ఏడాదికి 20.7 కిలోగ్రాముల చేపలను తింటున్నారు. మన దేశానికి వచ్చేసరికి ఈ సగటు కేవలం 9 కిలోలు మాత్రమే ఉంది. అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం.
కేంద్ర మత్స్యశాఖ అధికారులు, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వారానికి కనీసం రెండు సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
కండరాల పెరుగుదల, శరీర పునరుజ్జీవనానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. థైరాయిడ్ ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి.
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. వాటిని కొనుగోలు చేసేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు.. వండే ముందు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే.. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం అనేక మందికి ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. చేపల రకం, వ్యక్తి వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకునే మోతాదు మారవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..