
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఎందరికో ఆదర్శం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినీ ప్రస్థానంలో కీలకమైన పెళ్లిచూపులు చిత్రం విడుదలై నేటికి పదేళ్లు పూర్తైంది. ఎలాంటి అంచనాలు లేకుండా 2016 జూలై 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, విజయ్‌కు సోలో హీరోగా తొలి సూపర్ హిట్ అందించింది.పెళ్లిచూపులుతో మొదలైన విజయ్ కెరీర్, ఆ తర్వాత అర్జున్ రెడ్డి వంటి రిస్కీ సబ్జెక్టుతో స్టార్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, గీతా గోవిందం వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు. ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను తానే నిర్మించుకున్నారు. స్వయంకృషితో ఎదిగిన ఈ రౌడీ భాయ్ ప్రస్తుతం ఇండియా స్టార్‌గా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. ఆయన పదేళ్ల సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.