ODI World Cup 2027 : వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ ప్రపంచకప్ టోర్నీ అనగానే క్రికెట్ అభిమానుల్లో వచ్చే ఆ ఊపే వేరు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా సంగ్రామం 2027లో మళ్లీ రాబోతోంది. దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన అప్‌డేట్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2027 మెన్స్ వన్డే వరల్డ్ కప్ వేదికలను ఖరారు చేసింది. సరిగ్గా 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నీ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం విశేషం. చివరిసారిగా 2003లో ఆఫ్రికా ఖండంలో వన్డే ప్రపంచకప్ జరగ్గా.. మళ్లీ ఇప్పుడు 2027లో నిర్వహించనున్నారు.
మూడు దేశాలు.. 12 నగరాల్లో మ్యాచ్‌లు
జోహ్యానెస్‌బర్గ్ వేదికగా జరిగిన గురువారం (జూలై 30) నాటి ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ ఈ వేదికలను ప్రకటించింది. ఈసారి టోర్నీని సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం 12 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో సింహభాగం వేదికలు సౌతాఫ్రికాకే దక్కాయి. సౌతాఫ్రికాలోని 8 ప్రధాన నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా, జింబాబ్వేలోని 3 నగరాల్లో, నమీబియాలోని ఒక నగరంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ అనే బ్రాండ్ నినాదంతో ఈ టోర్నమెంట్‌ను ప్రచారం చేస్తున్నారు.
నమీబియాలో చరిత్ర.. సరికొత్త ఫ్లడ్‌లైట్స్ స్టేడియం
2003లో సౌతాఫ్రికా, జింబాబ్వేలతో పాటు కెన్యా సహ-ఆతిథ్యం ఇవ్వగా, ఈసారి కెన్యా స్థానాన్ని నమీబియా భర్తీ చేసింది. నమీబియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ మెగా ఈవెంట్ కోసమే రాజధాని విండ్‌హోక్‌లో ఐసీసీ సాయంతో ఒక అత్యాధునిక ఇంటర్నేషనల్ స్టేడియాన్ని నిర్మించారు. ఆ దేశంలో డే-నైట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఫ్లడ్‌లైట్స్ సౌకర్యం ఉన్న మొట్టమొదటి స్టేడియం ఇదే కావడం గమనార్హం.
టోర్నీ ఫార్మాట్, వేదికల పూర్తి వివరాలు
అక్టోబర్-నవంబర్ 2027 సమయంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 14 జట్లు ఈ ప్రపంచకప్‌లో పాల్గొంటాయి, అయితే సూపర్-12 మెయిన్ రౌండ్‌కు చేరుకోవడానికి ముందే రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే 12 వేదికల జాబితా
1. వాండరర్స్, జోహ్యానెస్‌బర్గ్ (సౌతాఫ్రికా)
2. సెంచూరియన్, తష్వానే (సౌతాఫ్రికా)
3. న్యూలాండ్స్, కేప్‌టౌన్ (సౌతాఫ్రికా)
4. కింగ్స్‌మీడ్, డర్బన్ (సౌతాఫ్రికా)
5. సెయింట్ జార్జెస్ పార్క్, గబెరా (సౌతాఫ్రికా)
6. మంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటెన్ (సౌతాఫ్రికా)
7. బోలాండ్ పార్క్, పార్ల్ (సౌతాఫ్రికా)
8. బఫెలో పార్క్, ఈస్ట్ లండన్ (సౌతాఫ్రికా)
9. హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే (జింబాబ్వే)
10. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో (జింబాబ్వే)
11. ఫాలే మోసీ-ఓవా-టూన్యా ఇంటర్నేషనల్ స్టేడియం, విక్టోరియా ఫాల్స్ (జింబాబ్వే)
12. నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్ (నమీబియా)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..