ఈజీ మనీకోసం అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మద్దిపాడులో ఈనెల 23వ తేదిన తాళం వేసిన ఓ ఇంటిని బ్రేక్ చేసి చోరీకి పాల్పడిన కేసును కేవలం వారం రోజుల వ్యవధిలోనే చేధించారు పోలీసులు. ఇన్నోవా కారులో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించి పకడ్బందీగా ప్లాన్ చేసి తాళం వేసిన ఇంటిని ఎంచుకుని తాళాలు పగులగొట్టి ఇంట్లోని 157 గ్రాముల బంగారు నగలు, 51 వేల నగదు అపహరించారు. ఈ చోరీకి పాల్పడింది నెల్లూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. నెల్లూరుజిల్లాకు చెందిన గోపిశెట్టి సునీల్, పల్నాడుజిల్లాకు చెందిన అన్నదమ్ములు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి ఆనంద్, ఎన్టీఆర్‌జిల్లాకు చెందిన మలమంతి సాయికుమార్‌లు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉంటూ జైల్లో కలుసుకున్నారు. ఆ తరువాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత చెడు వ్యసనాలకు బానిసలుగా ఉండటం వల్ల ఈజీ మనీ కోసం తిరిగి చోరీలు చేసేందుకు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఓ ఇన్నోవా కారులో చీరాల బీచ్ కి వచ్చి అక్కడ సరదాగా గడిపి తరువాత పొన్నూరు, చీరాల, బాపట్ల తదితర ప్రాంతాలలో చోరీలు చేసేందుకు రెక్కీ నిర్వహించారు.
ఈనెల 23వ తేదిన ప్రకాశం జిల్లా మద్దిపాడు ప్రాంతంలో కారులో తిరుగుతూ ఓ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీసాల వెంకట వంశీకృష్ణ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి, సొంత పనులుకోసం బయటకు వెళ్ళినట్టు గ్రహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు 26 సవర్లు బంగారపు ఆభరణాలు, కొంత నగదును అపహరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పాత నేరస్ధుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితుల ఆచూకీ లభించింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి 18 లక్షల విలువైన బంగారు నగలు, 51 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును కేవలం వారంరోజుల్లోనే చాకచక్యంగా వ్యవహరించి ఛేధించిన ఒంగోలు రూరల్ సిఐ శేషగిరిరావు, మద్దిపాడు ఎస్ఐ వెంకటసూర్య , పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.
మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,