Headlines

భక్తులకు అలర్ట్.. శ్రీవారి వీఐపీ దర్శనాన్ని ఎరగా వేసిన రియల్ ఎస్టేట్ సంస్థ..! టీటీడీ సీరియస్

భక్తులకు అలర్ట్.. శ్రీవారి వీఐపీ దర్శనాన్ని ఎరగా వేసిన రియల్ ఎస్టేట్ సంస్థ..! టీటీడీ సీరియస్


తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశాడో ఘనుడు. తిరుమల వీవీఐపీ దర్శనాన్ని ఎరగా చూపిస్తూ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తున్న ప్రచారం ఇప్పుడు చర్చగా మారింది. వివాదాస్పదంగా మారిన వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్ళింది. ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో విడుదలైన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితాంతం తిరుమల వీవీఐపీ దర్శనం కల్పిస్తామన్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. దర్శనం ఎలా కల్పిస్తారన్న వివరాల కోసం తమ సంస్థను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొంది. టీటీడీకి చెందిన దర్శన వ్యవస్థపై ప్రైవేట్ సంస్థ హామీ ఇవ్వడంతో భక్తులు, నెటిజన్ల నుంచి అభ్యంతరం వ్యక్తమౌతోంది. దేవుడి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమిటన్న విమర్శలు వస్తుండగా.. జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన టీటీడీ చర్యలు చేపట్టింది.

ఎస్సీపీ డెవెలపర్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటున్న టీటీడీ.. సోషల్ మీడియాలో SCP డెవలపర్స్ పేరుతో తిరుపతి హైవేలో ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ప్రచారం చేస్తున్న రీల్స్‌ను ఖండించింది.
ఇలాంటి ప్రచారంతో టీటీడీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటన జారీ చేసింది. ఇలాంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు, వ్యక్తికి లేదని స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని సేవలు, టికెట్లు పూర్తిగా టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే జారీ చేస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి



ఎవరైనా వ్యక్తులు, సంస్థలు భక్తులను ఆకర్షించేందుకు టీటీడీ పేరు, శ్రీవారి పేరు, దర్శనాల పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా టీటీడీ భావిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా రీల్స్, వాణిజ్య ప్రకటనలను నమ్మి భక్తులు మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని టీటీడీ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *