Headlines

IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ

IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ


చెన్నై, జులై 28: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ‘బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్’ పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు AI ఆధారిత స్టార్టప్‌ను ప్రారంభించడం నుంచి దాన్ని విజయవంతమైన వ్యాపారంగా అభివృద్ధి చేయడం వరకు అవసరమైన ప్రతి అంశంపై ఈ కార్యక్రమంలో ప్రాయోగిక శిక్షణ అందించనున్నారు. మార్కెట్‌లో అవకాశాలను గుర్తించడం, మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్ (MVP) రూపకల్పన, వ్యాపార నమూనా (బిజినెస్ మోడల్) తయారీ, పెట్టుబడుల సమీకరణ (ఫండ్‌రైజింగ్), ఇన్వెస్టర్లకు సమర్థవంతంగా ప్రెజెంటేషన్ ఇవ్వడం వంటి కీలక అంశాలపై పాల్గొనేవారికి అవగాహన కల్పిస్తారు.

ఈ ప్రోగ్రామ్‌కి టుగెదర్ ఫండ్ జనరల్ పార్ట్నర్, గూగుల్ సెర్చ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ శంకర్ నేతృత్వం వహించనున్నారు. ఆయన గతంలో గూగుల్, ట్విట్టర్, IBM, EY వంటి ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి స్లోన్ ఫెలోగా గుర్తింపు పొందారు. ఈ శిక్షణలో తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ వ్యాయామాలు, విజయవంతమైన AI స్టార్టప్‌ల వాస్తవ అనుభవాలపై చర్చలు నిర్వహిస్తారు. కస్టమర్ డిస్కవరీ, మార్కెట్ వాలిడేషన్, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్, యూజర్ అక్విజిషన్, రెవెన్యూ వ్యూహం, ఫండ్‌రైజింగ్, టర్మ్ షీట్ చర్చలు, స్టార్టప్ విస్తరణ వంటి అంశాలపై లోతైన శిక్షణ అందిస్తారు. ప్రోగ్రామ్‌ చివరి రోజున ‘పిచ్ డే’ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు తమ AI స్టార్టప్ ఆలోచనలను పెట్టుబడిదారుల బృందం ముందు ప్రదర్శిస్తాయి. ఉత్తమ స్టార్టప్ ప్రతిపాదనకు రూ.4 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేసి, ఆ స్టార్టప్ అభివృద్ధికి సహాయం చేయనున్నారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ కార్యక్రమానికి చివరి సంవత్సరం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, AI రంగంలో స్టార్టప్ ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలు, ప్రారంభ దశలో ఉన్న AI స్టార్టప్ బృందాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పరిశీలన అనంతరం ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *