Headlines

IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం.. 2 రోజుల యాత్రకు ఎంత ఖర్చు? పూర్తి వివరాలు

IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం.. 2 రోజుల యాత్రకు ఎంత ఖర్చు? పూర్తి వివరాలు


Ayodhya Ram Mandir: అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర సరయూ నది తీరంలో వెలసిన ఈ ప్రాచీన నగరం ‘భగవాన్ శ్రీరాముడి జన్మస్థలంగా’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్న అయోధ్యను ‘సాకేతం’ అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త పురీలలో అయోధ్యకు మొదటి స్థానం ఉంది. రామాయణ మహాకావ్యంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. శ్రీరాముడి దర్శనం చేయాలనుకునే భక్తుల కోసం IRCTC ప్రత్యేకంగా “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” పేరుతో 2 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, స్థానిక దర్శనాలు వంటి సౌకర్యాలతో ఈ ప్యాకేజీ రూపొందించబడింది.

ప్యాకేజీ ముఖ్యాంశాలు

  • ప్యాకేజీ పేరు: రామ్ లల్లా దర్శన్ అయోధ్య
  • సందర్శించే ప్రదేశాలు: సరయూ ఘాట్, రామ్ లల్లా ఆలయం, హనుమాన్ గఢీ, కనక్ భవన్
  • ప్రయాణ విధానం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
  • బయలుదేరు స్టేషన్: ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ)
  • బయలుదేరు సమయం: ఉదయం 6:10 గంటలకు
  • రైలు క్లాస్: చైర్ కార్ (CC)
  • టూర్ నిర్వహణ: ప్రతి శుక్రవారం, శనివారం
  • వసతి: హోటల్ తరాజీ రిసార్ట్ లేదా సమానమైన హోటల్
  • భోజనం: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ (శాకాహారం)

ప్యాకేజీ ధరలు:

  • సింగిల్ ఆక్యుపెన్సీ: ₹16,170
  • డబుల్ షేరింగ్: ₹10,950
  • ట్రిపుల్ షేరింగ్: ₹9,700
  • 5–11 ఏళ్ల పిల్లలు (బెడ్‌తో): ₹9,360
  • 5–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): ₹8,980

గమనిక: బుకింగ్ సమయంలో అమల్లో ఉన్న ధరలే వర్తిస్తాయి. రైల్వే ఛార్జీలు లేదా ఇతర వ్యయాలు పెరిగితే అదనపు మొత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించాల్సి ఉంటుంది.

టూర్ షెడ్యూల్

మొదటి రోజు: ఆనంద్ విహార్ టెర్మినల్ – అయోధ్య

ఉదయం 6:10 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22426) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రైలులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తారు. మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత హోటల్‌కు తరలిస్తారు. చెక్-ఇన్ అనంతరం పవిత్రమైన సరయూ ఘాట్ సందర్శన ఉంటుంది. అవసరమైతే అదనపు దుస్తులు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. సాయంత్రం రామ్ లల్లా ఆలయంలో శ్రీరాముడి దర్శనం ఏర్పాటు ఉంటుంది. అనంతరం హోటల్‌లో భోజనం చేసి రాత్రి బస.

ఇవి కూడా చదవండి



రెండో రోజు: అయోధ్య – ఆనంద్ విహార్ టెర్మినల్

ఉదయం అల్పాహారం అనంతరం హనుమాన్ గఢీ, కనక్ భవన్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ చెక్-అవుట్ చేసి, అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సుమారు 2:15 గంటలకు అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు నెం. 22425 ద్వారా 3:20 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి 11:40 గంటలకు ఆనంద్ విహార్ టెర్మినల్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకల CC క్లాస్ రైలు టికెట్లు
  • అయోధ్యలో ఒక రాత్రి హోటల్ బస
  • రైల్వే స్టేషన్ నుంచి హోటల్‌కు, హోటల్ నుంచి స్టేషన్‌కు ఏసీ వాహనంలో షేరింగ్ ట్రాన్స్‌ఫర్
  • షెడ్యూల్ ప్రకారం శాకాహార భోజనం
  • రైలు ప్రయాణంలో భోజనం
  • జీఎస్టీ

ప్యాకేజీలో లేనివి

  • వ్యక్తిగత ఖర్చులు, టిప్స్, లాండ్రీ, మినరల్ వాటర్, టెలిఫోన్ ఛార్జీలు
  • ఆలయ ప్రత్యేక దర్శనం, ఆరతి పాస్‌లు, లైన్ దర్శన్ పాస్‌లు
  • స్మారక చిహ్నాలు లేదా ఇతర ప్రవేశ రుసుములు
  • షెడ్యూల్‌లో పేర్కొనని అదనపు దర్శనాలు లేదా కార్యకలాపాలు
  • ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

  • ఈ టూర్‌లో VIP లేదా ప్రాధాన్యత దర్శనం సౌకర్యం ఉండదు.
  • రైలు ఆలస్యం, వాతావరణ పరిస్థితులు, భారీ రద్దీ, రవాణా సమస్యలు లేదా ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఏదైనా దర్శనం లేదా సందర్శన జరగకపోతే IRCTC బాధ్యత వహించదు. అలాంటి సందర్భాల్లో రీఫండ్ ఇవ్వబడదు.
  • టూర్ షెడ్యూల్‌ను పరిస్థితులకు అనుగుణంగా IRCTC మార్చే హక్కు కలిగి ఉంటుంది.
  • హోటల్ చెక్-ఇన్, చెక్-అవుట్ సమయం మధ్యాహ్నం 12 గంటలు.
  • ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
  • కనీసం ఇద్దరు ప్రయాణికులు బుకింగ్ చేసినప్పుడు మాత్రమే టూర్ నిర్వహించబడుతుంది.
  • ప్రయాణికులు టూర్ షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలి. మధ్యలో టూర్ విడిచిపెడితే లేదా ఆలస్యంగా చేరితే ఎలాంటి రీఫండ్ ఉండదు.

RAM LALLA DARSHAN AYODHYA (NDR012) టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *