Headlines

రూ.4 లక్షల కొలువు వదిలి GATE రాశాడు.. కట్‌చేస్తే రూ.30 లక్షల జీతంతో Qualcommలో జాబ్‌!

రూ.4 లక్షల కొలువు వదిలి GATE రాశాడు.. కట్‌చేస్తే రూ.30 లక్షల జీతంతో Qualcommలో జాబ్‌!


ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే వచ్చిన ఉద్యోగాన్ని వదిలేయడం చాలా మందికి సాహసోపేత నిర్ణయంగా అనిపిస్తుంది. అయితే తన లక్ష్యంపై నమ్మకంతో అలాంటి నిర్ణయం తీసుకున్న ఓ యువ ఇంజినీర్ ఇప్పుడు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. రూ.4 లక్షల వార్షిక వేతనంతో వచ్చిన ఉద్యోగాన్ని తిరస్కరించి, GATE పరీక్ష కోసం ఏడాది పాటు కష్టపడి చదివి, చివరకు IIT హైదరాబాద్‌లో చేరి, ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm) నుంచి రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎక్స్‌ వేదికగా @VikasAlwys అనే యూజర్‌ ఈ స్టోరీని పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

రూ.4 లక్షల ఉద్యోగాన్ని వదిలిన హైదరాబాద్ టెకీ

ఈ కుర్రాడు (పేరు చెప్పలేదు) 2023లో హైదరాబాద్‌లోని CVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE)లో బీటెక్ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక Sutherland సంస్థలో రూ.4 లక్షల వార్షిక వేతనంతో నాన్-టెక్నికల్ ఉద్యోగం లభించింది. అయితే తన లక్ష్యం GATEలో మంచి ర్యాంక్ సాధించి ఉన్నత విద్య అభ్యసించడం కావడంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఉద్యోగాన్ని వదిలి GATE కోసం ఏడాది సమయం తీసుకోవాలన్న నిర్ణయాన్ని మొదట్లో అతని తండ్రి నచ్చలేదు. ఉద్యోగంలో చేరాలని సూచించారు. కానీ తన సామర్థ్యాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ PGECET పరీక్ష రాసిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ అద్భుత ఫలితంతో అతని తండ్రి కూడా అతని నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని OHM Instituteలో చేరి GATE పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.

GATEలో AIR 1200.. IIT హైదరాబాద్‌లో ప్రవేశం

ఇక GATE-2024లో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1200 సాధించాడు. దీంతో IIT హైదరాబాద్లోని M.Tech (VLSI) కోర్సులో ప్రవేశం పొందాడు. అక్కడ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని సెమీకండక్టర్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన అనంతరం ప్రముఖ సెమీకండక్టర్ దిగ్గజం Qualcomm నుంచి రూ.30 లక్షల వార్షిక CTCతో ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇందులో బేసిక్ వేతనం సుమారు రూ.18 లక్షల వార్షికంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కుర్రడి కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా GATE, M.Tech, VLSI రంగాల్లో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ విజయగాథను స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నారు. కష్టకాలంలో కూడా లక్ష్యాన్ని వదలకుండా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘నమ్మండి.. ఇతరులు నమ్మకపోయినా.. మీరు ఎంచుకున్న మార్గాన్ని, మీ కష్టాన్ని నమ్మండి. విజయానికి సమయం పడుతుంది కానీ ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది’ అని ఓ యూజర్ కామెంట్‌ సెక్షన్‌లో హార్ట్ టచింగ్‌గా తన అభిప్రాయం పంచుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *