టీ అనేది మన దేశంలో చాలామంది రోజును ప్రారంభించే ఒక ఆహ్లాదకరమైన పానీయం. సాధారణ టీకి కొన్ని సహజసిద్ధమైన మసాలా దినుసులు కలపడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మన వంటింట్లో లభించే మసాల దినుసులు టీని ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్‌గా మారుస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, జలుబు, రొంప వంటి సమస్యల నుండి ఉపశమనం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజువారీ ఛాయ్‌లో ఈ దినుసులను చేర్చుకోవడం ద్వారా అటు రుచిని, ఇటు ఆరోగ్యాన్ని ఒకేసారి పొందవచ్చు. అలాంటి దివ్యమైన ఔషదాలేంటో ఇప్పుడు చూద్దాం..
అల్లం :
టీలో అల్లం వేయడం చాలామందికి అలవాటే. అల్లంలో ఉన్న జింజెరాల్ అనే మూలకం శరీరంలో శోథ నిరోధక గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వర్షాకాలం, చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
యాలకులు:
యాలకులు టీకి అద్భుతమైన సువాసనను, తీపి రుచిని అందిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో యాలకుల టీ ఎంతో మేలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
దాల్చినచెక్క:
దాల్చినచెక్క టీకి ప్రత్యేకమైన తీపి మరియు ఘాటైన రుచిని ఇస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మరియు మెటబాలిజం పెంచుకోవాలనుకునే వారికి దాల్చినచెక్క వేసిన టీ చాలా మంచి ఎంపిక.
లవంగాలు:
లవంగాలలో క్రిమిసంహారక, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటి నొప్పులు, నోటి సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. లవంగాల ఘాటు శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
నల్ల మిరియాలు:
మిరియాలలో ఉండే పైపరెన్ అనే కాంపౌండ్ శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించే శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, పిత్త దోషాలను తగ్గించడంలో మిరియాల టీ అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మసాలా దినుసులన్నింటినీ సమపాళ్లలో పొడి చేసి మసాలా టీ పౌడర్ తయారుచేసుకుని రోజూ టీలో వాడుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..