Headlines

Mahanati Savitri: ఆ సభలో మహానటి సావిత్రి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

Mahanati Savitri: ఆ సభలో మహానటి సావిత్రి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..


భారతీయ చిత్రసీమలో తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మహానటి సావిత్రి, అభినయానికి చిరునామాగా నిలిచారు. కళ్ళతోనే కోటి భావాలను పలికించగల ఆమె అద్భుత నటిగా చరిత్రలో స్థానం సంపాదించారు. తెలుగునాటే కాదు, తమిళ చిత్రాలతో తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేసి, నటనకు నిఘంటువుగా మారారు. పౌరాణిక చిత్రాలైన మాయాబజార్, శ్రీ వేంకటేశ్వర మహాత్యం, నర్తనశాల, పాండవవనవాసం నుండి జానపద చిత్రాలైన చంద్రహారం, బండరాముడు, కంచుకోట వరకు; సాంఘిక చిత్రాలైన దేవదాసు, కన్యాశుల్కం, మిస్సమ్మ, దొంగరాముడు, తోడికోడళ్లు, మూగ మనసులు, రక్త సంబంధం, గుండమ్మ కథ వంటి ఎన్నో చిత్రాలలో ఆమె నటన చిరస్మరణీయం.

తెలుగు వారికి గర్వకారణమైన ఈ మహానటి జీవితంలో 1977, సెప్టెంబర్ 15న ఒక అపూర్వమైన, భావోద్వేగమైన సన్మాన కార్యక్రమం జరిగింది. చెన్నైలోని సవేరా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సతీసమేతంగా హాజరయ్యారు. నాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినప్పటికీ.. అంజలీదేవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, కాంచన, ప్రభ, గాయని పి. సుశీల, రమాప్రభ వంటి ప్రముఖులు; హీరోలలో కృష్ణంరాజు, దర్శకనిర్మాత బీఎన్ రెడ్డి వంటి ఎందరో సినీ దిగ్గజాలు ఈ వేడుకకు విచ్చేశారు. సావిత్రిని శాలువాతో సత్కరించిన బీఎన్ రెడ్డి, ఈ సన్మానం దేశంలోని కళాకారులందరికీ జరిగే సన్మానంగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. చెన్నైలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సంస్థ తరపున ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సావిత్రికి వెండి దీపం బహుకరించారు. ఈ సందర్భంగా ఎందరో సినీ ప్రముఖులు సావిత్రిపై తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. పట్టుచీరతో పాటు బంగారు నెక్లెస్ బహుకరించిన వాణిశ్రీ, గద్గద స్వరంతో సావిత్రిని “ఈ మహానటి నాకు మార్గం చూపిన దేవత. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉన్నా నా అభిమాన నటి” అని ప్రశంసించారు. జయప్రద రెండు జతల బంగారు గాజులు, జయసుధ బంగారు ఉంగరం, ప్రభ పట్టుచీర, కాంచన శాలువా, రమాప్రభ వినాయకుని విగ్రహం బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అయితే సావిత్రిని కోహినూర్ వజ్రంతో పోల్చారు. “ఆ వజ్రం కోసం దేశాలు ఎలా పోట్లాడుకుంటున్నాయో, అలాగే సావిత్రి మా భాషకు చెందిన నటి అంటే, మా భాషకు చెందిన నటి అని పోట్లాడుకుంటున్నారు” అని ఆమె ప్రాధాన్యతను వివరించారు.

ఈ సభకు ముగింపుగా సావిత్రి చేసిన ప్రసంగం అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. “ఈ రోజు నా కళా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నేను మూలపడిపోయానని అంటున్నారు, అది వాస్తవమే. కారణాలు నాకూ తెలియదు. ఎవరైనా చెబితే సరిదిద్దుకుంటాను. నాకు తెలిసి కళకు నేను ద్రోహం చేయలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో తార నక్షత్రం లాంటిదని, ఉన్నంతవరకు మిణుకు మిణుకుమని వెలుగుతూనే ఉంటుందని ఆమె అన్నారు. “పడిపోయిన నక్షత్రాన్ని వెలుగులోకి రావాలని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నన్ను దేవత అని పొగడడం కంటే, కొన్ని అవకాశాలు ఇస్తే నేను సంతోషిస్తా” అని భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రంలో నటిస్తున్నానని, అది చూసి సావిత్రి మళ్లీ పుట్టిందని అందరూ అంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మకథ రాయమని కొందరు అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే నాలా ధైర్యంగా రాయగలిగేవారు ఎవరూ లేరని, అయితే అలా రాస్తే పెద్ద, చిన్న అందరూ ఇబ్బంది పడతారని పేర్కొంటూనే, అయినా వీలు చూసుకొని రాస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రసంగం ఆమె కళాపరమైన నిబద్ధతను, నిరాడంబరతను, మళ్లీ ప్రకాశించాలనే ఆమె ఆకాంక్షను స్పష్టం చేసింది.

(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *