Headlines

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా బలపడింది. ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ వాయుగుండం సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్య పారాదీప్–సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతాలపై కూడా కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారడంతో పాటు భారీ అలలు ఎగసిపడే పరిస్థితులు ఉండవచ్చని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏడు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది.

తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించి, తీర ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *