
వర్షాకాలంలో లేదా వేసవి కాలంలో ఇళ్లలోకి ఈగలు, దోమలు, చీమలు వంటి పురుగులు రావడం చాలా సాధారణ సమస్య. వీటి వల్ల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. చాలామంది వీటి నివారణకు మార్కెట్లో దొరికే కెమికల్ ఆల్ అవుట్లు, స్ప్రేలు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని కిచెన్ పదార్థాలను ఉపయోగిస్తే ఈ పురుగుల బెడద నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
నీటిలో కలపాల్సిన సహజ పదార్థాలు:
కాల్చిన కర్పూరం, పొడి: కర్పూరం వాసన ఈగలు, దోమలకు అస్సలు పడదు. ఇల్లు తుడిచే నీటిలో కర్పూరం పొడి చేసి కలపాలి. ఇది క్రిమి సంహారిణిగా పనిచేసి, ఇల్లంతా మంచి సువాసనను నింపుతుంది.
తెల్ల వెనిగర్: వెనిగర్‌లోని ఆమ్ల గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. బకెట్ నీటిలో అర కప్పు వెనిగర్ కలిపి తుడవడం వల్ల ఫ్లోర్ మెరవడమే కాకుండా ఈగలు రాకుండా ఉంటాయి.
ఉప్పు: రాతి ఉప్పు లేదా కల్లు ఉప్పును నీటిలో కలిపి తుడవడం వల్ల నేలపై ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఉప్పుతో ఇల్లు తుడిస్తే నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది.
వేప నూనె: వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దోమలు, ఈగలను దూరంగా ఉంచుతాయి. కొన్ని చుక్కల వేప నూనెను నీటిలో కలిపి ఉపయోగించవచ్చు.
యూకలిప్టస్ నూనె: ల్యావెండర్ లేదా యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొన్ని చుక్కలు కలిపితే దోమలు ఇళ్లలోకి రావు, ఇల్లు కూడా రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది.
దీనికోసం బకెట్ నీటిలో 1 స్పూన్ ఉప్పు, 2-3 కర్పూరం బిళ్లల పొడి, అర కప్పు వెనిగర్ బాగా కలపండి. ఈ నీటితో ఇంట్లోని అన్ని మూలలు, తలుపుల వెనుక భాగాన్ని బాగా తుడవండి. ఈ చిన్న సహజమైన చిట్కాలను రోజూ పాటించడం ద్వారా మీ ఇల్లు పరిశుభ్రంగా, సువాసనభరితంగా మారడమే కాకుండా దోమలు, ఈగల నుండి పూర్తి రక్షణ లభిస్తుంది.