Gold Reserves: పాకిస్థాన్ కంటే రెట్టింపు బంగారం.. ఆర్‌బీఐ కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న కంపెనీ!

Gold Reserves: పాకిస్థాన్ కంటే రెట్టింపు బంగారం.. ఆర్‌బీఐ కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న కంపెనీ!


Gold Reserves: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేబుల్‌కాయిన్ (Stablecoin) జారీ చేసే క్రిప్టో సంస్థ ‘టీథర్’ (Tether) తన గోల్డ్ రిజర్వ్స్‌తో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. టీథర్ వద్ద ఉన్న బంగారు నిల్వలు ఇప్పుడు రికార్డు స్థాయిలో 132 టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది కాలంలోనే ఈ కంపెనీ తన బంగారు నిల్వలను రెట్టింపు చేసుకోవడం విశేషం.

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు:

ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో టీథర్ సుమారు 6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, అంతకుముందు త్రైమాసికంలో ఏకంగా 27 టన్నుల బంగారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ స్థాయిలో బంగారం సేకరించడంలో టీథర్.. భారతదేశ సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ (RBI)ని కూడా మించిపోయింది. గతేడాది భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేవలం 4 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, 2024లో ఇప్పటివరకు 72.6 టన్నులను సేకరించింది. అయితే దేశాల సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే ఒక ప్రైవేట్ సంస్థ ఇంత భారీగా బంగారం నిల్వ చేయడం చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్ కంటే రెట్టింపు:

టీథర్ వద్ద ఉన్న 132 టన్నుల బంగారం విలువ సుమారు 19.8 బిలియన్ డాలర్లు. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం కేవలం 65 టన్నుల బంగారం మాత్రమే ఉండగా, టీథర్ వద్ద దానికి రెట్టింపు నిల్వలు ఉన్నాయి. ఒకవేళ టీథర్ కనుక ఒక దేశం సెంట్రల్ బ్యాంక్ అయి ఉంటే, ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 20 దేశాల జాబితాలో నిలిచేది.

ఇవి కూడా చదవండి

ఏమిటీ టీథర్ (USDT)?

టీథర్ అనేది అమెరికన్ డాలర్ విలువకు సమానంగా ఉండేలా రూపొందించిన ఒక స్టేబుల్‌కాయిన్. దీనిని ‘డిజిటల్ డాలర్’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు 189.5 బిలియన్ డాలర్ల విలువైన టీథర్ టోకెన్లు చెలామణిలో ఉన్నాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా ఈ కంపెనీ వద్ద 7 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్లు (Bitcoin) కూడా ఉన్నాయి.

టెథర్ ఎలా పనిచేస్తుంది?

మీరు ఒక ‘టెథర్’ కాయిన్ కొనాలంటే, ఆ కంపెనీకి ఒక డాలర్ ఇవ్వాలి. వారు ఆ డాలర్‌ను తమ బ్యాంకు రిజర్వులో భద్రపరిచి, మీకు ఒక డిజిటల్ టోకెన్ (USDT) ఇస్తారు. మీ వద్ద ఉన్న డిజిటల్ టోకెన్‌ను ఎప్పుడైనా తిరిగి ఇచ్చేసి, మీ డాలర్‌ను మీరు తీసుకోవచ్చు. ఇటీవలి వార్తల ప్రకారం, ఈ కంపెనీ తమ వద్ద ఉన్న డాలర్లకు భద్రతగా కేవలం నగదునే కాకుండా భారీగా బంగారం (Gold), బిట్‌కాయిన్లను కూడా నిల్వ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Electric Car: సింగిల్ ఛార్జ్‌తో 710 కి.మీ. రేంజ్.. 9 నిమిషాల్లో 97% ఛార్జ్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్‌ కారు..!

దీనిని ఎందుకు ఉపయోగిస్తారు?

క్రిప్టో మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి ఇది ఒక ‘సేఫ్ హెవెన్’ (సురక్షిత ప్రాంతం) లాంటిది. లాభాలను దాచుకోవడానికి.. ఉదాహరణకు, మీరు బిట్‌కాయిన్ కొన్నారు.. దాని ధర పెరిగింది. ఆ లాభం పోకుండా ఉండాలంటే, వెంటనే దానిని USDTలోకి మార్చుకుంటారు.

ఒక దేశం నుండి ఇంకో దేశానికి డాలర్లు పంపాలంటే బ్యాంకుల ద్వారా చాలా సమయం పడుతుంది. అలాగే ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కానీ USDT ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నిమిషాల్లో పంపవచ్చు.

దీనిని ‘డిజిటల్ డాలర్’ అని ఎందుకు అంటారు?

ఇది ఫిజికల్ నోటు రూపంలో ఉండదు. కేవలం కంప్యూటర్ కోడ్ రూపంలో (బ్లాక్‌చైన్ నెట్‌వర్క్‌పై) ఉంటుంది. కానీ దీని విలువ డాలర్‌తో సమానం కాబట్టి, దీనిని క్రిప్టో ప్రపంచంలో డిజిటల్ డాలర్‌గా పిలుస్తారు.

గమనిక: టెథర్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ (Tether Limited) ద్వారా నిర్వహించబడుతుంది. ప్రభుత్వ సెంట్రల్ బ్యాంకులు జారీ చేసే కరెన్సీకి ఉన్నంత గ్యారెంటీ దీనికి ఉండదు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో లావాదేవీల్లో అత్యధికంగా వాడబడుతున్న కాయిన్ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిప్టో ప్రపంచంలో ఎప్పుడూ విలువ తగ్గని, డాలర్‌తో సమానమైన కరెన్సీయే ఈ ‘టెథర్ (USDT)’.

ఇది కూడా చదవండి: Electric Scooter: త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!

ఇది కూడా చదవండి: Indian Railays: రైలు ఆలస్యమైనందుకు ప్రయాణికుడికి రూ.1.25 లక్షలు చెల్లించిన రైల్వే.. అసలేమైందంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *