Tilak Varma : తిలక్ వర్మకు తప్పిన ప్రమాదం.. బంతి తగిలి కిందపడ్డ రూ. 28 వేల వాచ్.. వైరల్ వీడియో

Tilak Varma : తిలక్ వర్మకు తప్పిన ప్రమాదం.. బంతి తగిలి కిందపడ్డ రూ. 28 వేల వాచ్.. వైరల్ వీడియో


Tilak Varma : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన ఒక షాట్ బెడిసికొట్టడమే కాకుండా, అతని చేతికి ఉన్న ఖరీదైన వాచ్ కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వాచ్ ధర తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. సీఎస్‌కే ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ వేసిన ఆఖరి బంతిని తిలక్ వర్మ స్కూప్ షాట్ ఆడబోయాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి బ్యాట్‌కు తగలకుండా నేరుగా తిలక్ మణికట్టుకు బలంగా తగిలింది. ఆ దెబ్బ తీవ్రతకు అతని చేతికి ఉన్న ఖరీదైన హూప్ (WHOOP) ఫిట్‌నెస్ బ్యాండ్ ఊడిపోయి దూరంగా పడిపోయింది. ఆ దెబ్బకు తిలక్ నొప్పితో విలవిలలాడుతూ వెంటనే ఫిజియోను మైదానంలోకి పిలిచాడు.

ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటి?

తిలక్ వర్మ ధరించిన ఆ గడియారం సాధారణ వాచ్ కాదు. అది హూప్ అనే ఫిట్‌నెస్ ట్రాకింగ్ బ్యాండ్. దీని ధర మార్కెట్లో సుమారు రూ.28,000 వరకు ఉంటుంది. విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి అథ్లెట్లు తమ ఫిట్‌నెస్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్ ట్రాక్ చేయడానికి దీనిని వాడుతుంటారు. బంతి బలంగా తగిలి అది కిందపడినప్పటికీ, అదృష్టవశాత్తూ ఆ వాచ్ ఏమీ కాలేదు. తిలక్ దానిని మళ్ళీ ధరించి బ్యాటింగ్ కొనసాగించాడు.

దురదృష్టకరం.. వెంటనే అవుట్

వాచ్ పడిపోయిన ఘటన జరిగిన రెండు బంతులకే తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. ఆ దెబ్బ ప్రభావమో లేక ఏకాగ్రత దెబ్బతిందో కానీ, కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేయగా, చెన్నై జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి ముంబైని చిత్తు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. వాచ్ కి ఏమీ కాలేదు కానీ, ముంబై ఆశలే కిందపడ్డాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిలక్ వర్మ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ లో మాత్రం అటు వాచ్ ని, ఇటు వికెట్ ని రెండింటినీ ప్రమాదంలో పడేసుకున్నాడంటూ ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆ ఖరీదైన గడియారం భద్రంగా ఉండటంతో తిలక్ ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *