సూపర్‌ ఫుడ్.. బరువు తగ్గించి ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంచే రాగి ఇడ్లీలు.. ఇదొక్కటి వేస్తే దూదిలా వస్తాయ్..

సూపర్‌ ఫుడ్.. బరువు తగ్గించి ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంచే రాగి ఇడ్లీలు.. ఇదొక్కటి వేస్తే దూదిలా వస్తాయ్..


మిల్లెట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే.. ఇది తెలియక చాలా మంది నూనె పదార్థాలు, ఏవేవో టిఫిన్లు చేస్తుంటారు.. కానీ.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ముఖ్యంగా ఉదయం అల్పాహారం కోసం తక్షణ రాగి ఇడ్లీలు సరైన ఎంపిక..
రాగి ఇడ్లీలు అత్యంత పోషకమైన, ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం.. ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించేందుకు సహాయపడతాయి.. అంతేకాకుండా.. కడుపును చల్లగా ఉంచుతుంది.. రాగి ఇడ్లీలు రెగ్యులర్ గా తింటే.. ఇవి బరువు తగ్గడంలో, డయాబెటిస్‌ను నియంత్రించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. గ్లూటెన్ రహితమైనవి కావడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది మంచి ఆహారం.

అయితే.. పులియబెట్టాల్సిన అవసరం లేకుండా, కేవలం నిమిషాల్లోనే మెత్తటి – స్పాంజీ లాంటి రాగి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పులియబెట్టకుండా చేసే రాగి ఇడ్లీలు గట్టిగా ఉంటాయని అనుకుంటారు.. కానీ ఈ ప్రత్యేక విధానం ద్వారా చేసే ఇడ్లీలు రెగ్యులర్‌గా చేసే ఇడ్లీల కన్నా చాలా సాఫ్ట్‌గా వస్తాయని ఫుడ్ తయారీ నిపుణులు చెబుతున్నారు.. పీచు పదార్థం, అవసరమైన పోషకాలు నిండిన ఈ ఇడ్లీలు ఉదయాన్నే లేదా తేలికపాటి రాత్రి భోజనానికి అద్భుతంగా ఉంటాయి.

తక్షణ రాగి ఇడ్లీ తయారీ విధానం:

ముందుగా ఒక పాన్‌లో అర టేబుల్‌స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఒక టేబుల్‌స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్‌స్పూన్ మినపప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత, ఒక టేబుల్‌స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్‌స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, పావు కప్పు తురిమిన క్యారెట్ వేసి సన్నటి సెగపై వేయించాలి.

ఇవన్నీ బాగా వేగిన తర్వాత, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కనీసం 5-10 నిమిషాల పాటు సన్నటి సెగపై కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించాలి. రవ్వ చక్కగా వేగితే ఇడ్లీ రుచి బాగుంటుంది. రవ్వ కొద్దిసేపు వేగిన తర్వాత, అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసి రెండు-మూడు నిమిషాల పాటు కాస్త వెచ్చబడేంతవరకు వేయించాలి. చివరగా, రెండు టేబుల్‌స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి, స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి.

పిండిని గోరువెచ్చగా అయిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం రవ్వ, పిండిని కొలిచిన అదే కప్పుతో రెండు కప్పుల పెరుగు వేయాలి. ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగు వాడితే ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి. పెరుగు వేసి కలిపిన తర్వాత, అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని మూత పెట్టి, కనీసం 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పెరుగును పీల్చుకుని గట్టిపడుతుంది.

నానబెట్టిన తర్వాత, మూత తీసి తిరిగి ఒకసారి కలిపి, అర టీస్పూన్ వంట సోడా వేయాలి. వంట సోడా వేసాక కొద్దిగా నీళ్లు వేసుకుని, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి సరిపడా సర్దుబాటు చేసుకోవాలి. పులిసిన పెరుగు, వంట సోడా కలవడం వల్ల ఇడ్లీలు పొంగి, ఫ్లఫీగా వస్తాయి. పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి, ఇడ్లీలు మెత్తగా మారతాయి.

ఇడ్లీలు ఆవిరి మీద ఉడికించడం:

ఇడ్లీ స్టీమర్‌లో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇడ్లీ ప్లేట్లపై పల్చటి కాటన్ క్లాత్‌ను తడిపి వేసి, దానిపై ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నూనె లేదా నెయ్యి రాసిన ప్లేట్లలో కూడా నేరుగా ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంచి, మధ్యస్థ మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆపిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి, ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటికి తీసి ఇడ్లీలను సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసిన ఇడ్లీలు నోట్లో అలా కరిగిపోయేంత మెత్తగా, స్పాంజీగా ఉంటాయి. ఈ ఇడ్లీలను ఏ పచ్చడితో సర్వ్ చేసినా చాలా బాగుంటాయి, ముఖ్యంగా టమాటా చట్నీతో మరింత రుచిగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *