వేసవి సెలవుల్లో లేదా ఇతర పనుల మీద మనం కొన్ని రోజుల పాటు ఇల్లు వదిలి ఊరెళుతుంటాం. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో పాలు, కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాలను అలాగే ఉంచి వెళ్తాం. అయితే, మనం లేని సమయంలో కరెంటు కోత విధిస్తే, ఫ్రిజ్‌లోని ఐస్ కరిగిపోయి ఆహారం పాడైపోయే అవకాశం ఉంది. మనం తిరిగి వచ్చేసరికి కరెంటు ఉన్నా, మధ్యలో ఎన్ని గంటలు పవర్ కట్ అయ్యిందో మనకు తెలియదు. ఇలాంటి సమయంలో ఆహారం తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. దీనిని కనిపెట్టడానికే ఈ ఒక చెంచా చిట్కా. మీరు ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఊరెళుతున్నప్పుడు మీ ఫ్రిజ్‌లోని ఆహారం సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చెంచా చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
చెంచా ట్రిక్ ఎలా పనిచేస్తుంది?:
ఈ పద్ధతి చాలా సరళమైనది. ప్రభావవంతమైనది. మీరు ఊరెళ్లే ముందు ఈ చిన్న పని చేయండి. ఒక ప్లాస్టిక్ లేదా గాజు కప్పులో నీటిని నింపి ఫ్రీజర్‌లో పెట్టండి. ఆ నీరు పూర్తిగా గడ్డకట్టిన (Ice) తర్వాత, ఆ ఐస్ పైన ఒక చెంచాను అడ్డంగా ఉంచండి. ఇప్పుడు ఆ కప్పును మళ్ళీ ఫ్రీజర్‌లో ఉంచి మీరు ప్రయాణం సాగించవచ్చు.
ఫలితాన్ని ఎలా చూడాలి?:
మీరు ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రీజర్‌ను తెరిచి ఆ కప్పును చూడండి:
చెంచా ఐస్ పైనే ఉంటే: మీరు లేని సమయంలో కరెంటు పోలేదని లేదా చాలా తక్కువ సమయం పోయిందని అర్థం. ఐస్ కరగలేదు కాబట్టి ఫ్రిజ్‌లోని ఆహారం సురక్షితంగా ఉందని భావించవచ్చు. చెంచా ఐస్ మధ్యలో లేదా అడుగున ఉంటే: మీరు లేని సమయంలో కరెంటు ఎక్కువ సేపు పోయిందని దీని అర్థం. కరెంటు లేకపోవడం వల్ల కప్పులోని ఐస్ కరిగి, చెంచా కిందికి వెళ్ళింది. మళ్ళీ కరెంటు వచ్చిన తర్వాత ఆ నీరు మళ్ళీ గడ్డకట్టింది. ఇలాంటి స్థితిలో ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాలు కూడా పాడైపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని తినకపోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి
ఎందుకు ఉపయోగకరం?:
సాధారణంగా ఫ్రిజ్‌లో ఉంచిన మాంసం, పాలు వంటివి గంటల తరబడి తక్కువ ఉష్ణోగ్రత లేకపోతే బ్యాక్టీరియా చేరి విషపూరితంగా మారుతాయి. కంటికి కనిపించని ఈ మార్పులను కనిపెట్టడానికి ఈ చిన్న చెంచా లేదా నాణెం చిట్కా ఒక ఇండికేటర్‌లా పనిచేస్తుంది. ఇకపై మీరు ఎప్పుడు ఊరెళ్లినా మీ ఆరోగ్యం కోసం ఈ చిన్న పని చేయడం మర్చిపోకండి!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..