KL Rahul IPL 2026 Record: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడకుండా కేవలం 40 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆయన ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
సిక్సర్ల వీరుడిగా సరికొత్త చరిత్ర..
ఈ మ్యాచ్‌లో బాదిన 5 సిక్సర్ల ద్వారా కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 200 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు భారత్ నుంచి మరే ఓపెనర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. అంతర్జాతీయ స్థాయిలో క్రిస్ గేల్ (326), డేవిడ్ వార్నర్ (210) మాత్రమే రాహుల్ కంటే ముందున్నాడు. ప్రస్తుతం 203 సిక్సర్లతో రాహుల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఓపెనర్‌గా తిరుగులేని గణాంకాలు..
భారత క్రికెట్‌లో అత్యంత నమ్మదగ్గ ఆటగాడిగా గుర్తింపు పొందిన రాహుల్, ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 112 మ్యాచ్‌లు ఆడి 50.1 సగటుతో 4851 పరుగులు సాధించాడు. ఇందులో 6 శతకాలు, 39 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 192 సిక్సర్లతో రాహుల్ వెనుక ఉండగా, రోహిత్ శర్మ కనీసం మొదటి ఐదు స్థానాల్లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2026 సీజన్‌లో పరుగుల వరద..
ప్రస్తుత సీజన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ, ఆ తర్వాత రాహుల్ తన ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. ఢిల్లీ తరపున 9 ఇన్నింగ్స్‌ల్లో 185.83 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 433 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌పై ఆయన చేసిన 152 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ రాహుల్ పరుగుల యంత్రంలా దూసుకుపోతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..