వివరాల్లోకి వెళ్తే.. చిలిపిచెడ్ గ్రామానికి చెందిన పరశురాం, తన సోదరి రేణుకను తీసుకురావడానికి చండూర్ ఎక్స్ రోడ్డుకు వెళ్లాడు. హైదరాబాద్ నుంచి వస్తున్న అక్కను బైక్పై ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా.. చిలిపిచెడ్ వైపు నుండి జోగిపేట వెళ్తున్న కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరశురాం అక్కడికక్కడే మరణించగా, రేణుక రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాల య్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరసింహులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో మొదట సంగారెడ్డి బాలాజీ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిజానికి నేడు రేణుక పెళ్లికి సంబంధించి ‘పసుపు కొట్నం’ కార్యక్రమం జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆసుపత్రి పాలవ్వడం, తమ్ముడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.