Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి ప్రస్తుతం ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 238.09 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (167 బంతులు) 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్ నిపుణుడి వింత విశ్లేషణ..
వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లను చూసి పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌ను చూస్తుంటే అతనిలో ఏదో మ్యాజిక్ ఉందని, బహుశా అతని శరీరంలో లేదా బ్యాట్‌లో ‘కృత్రిమ మేధస్సు’ (ఏఐ) చిప్ అమర్చి ఉండవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. “ఈ అబ్బాయి అసాధారణంగా ఆడుతున్నాడు. డోపింగ్ పరీక్షలు చేసినట్లే, ఇతనిని ఏదైనా ప్రయోగశాలకు పంపి పరీక్షించాలి. బహుశా శరీరంలో ఏఐ చిప్ ఉందేమో” అని నియాజ్ పేర్కొన్నాడు. 18 ఏళ్లు నిండకముందే ఇంతటి శక్తివంతమైన షాట్లు ఆడటం అసాధ్యమని ఆయన కొనియాడాడు.
వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే సమాధానం..
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 43 పరుగులు చేసిన తర్వాత, నౌమాన్ నియాజ్ చేసిన ఈ ‘ఏఐ చిప్’ వ్యాఖ్యలపై వైభవ్ స్పందించాడు. దీనికి అతను నవ్వుతూ సమాధానమిస్తూ.. “ఆ చిప్‌ను దేవుడే స్వయంగా నా బ్యాట్‌కు అమర్చి పంపాడు. నేను పుట్టకముందే పైనున్న దేవుడు నా బ్యాట్‌లో ఏదో ఒక శక్తిని పెడుతున్నానని చెప్పాడు, ప్రస్తుతం నేను దాన్నే వాడుతున్నాను” అని బదులిచ్చాడు. ఈ సమాధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
చరిత్ర సృష్టించిన యువ సంచలనం..
ఈ సీజన్లో వైభవ్ కేవలం 167 బంతుల్లోనే 400 పరుగులు పూర్తి చేసి, గతంలో ఆండ్రీ రసెల్ (188 బంతులు), అభిషేక్ శర్మ (195 బంతులు) పేరిట ఉన్న రికార్డులను తిరగరాశాడు. 15 ఏళ్ల వయసులో పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శిస్తున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..