Bengal Election: ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. బీజేపీ బటన్‌పై టేపు.. రంగంలోకి ఈసీ!

Bengal Election: ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. బీజేపీ బటన్‌పై టేపు.. రంగంలోకి ఈసీ!


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. పోలింగ్ సాగుతున్న సమయంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్, భద్రతా దళాల లాఠీఛార్జ్ ఘటనలు కలకలం రేపాయి.

ఫల్తా నియోజకవర్గంలోని బూత్ నంబర్ 177 వద్ద బీజేపీ ఓటింగ్ బటన్‌ను టేపుతో కప్పివేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దేబన్షు పాండా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనకు, ఈవీఎంను తనిఖీ చేయడానికి అధికారులు అనుమతి నిరాకరించడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం, ఒకవేళ ఈ ఫిర్యాదులో నిజమున్నట్లు తేలితే సదరు బూత్‌లో తిరిగి ఓటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్ కంచుకోటగా భావించే ఫల్తాలోని బెల్సింఘాలోని బూత్ నంబర్ 186 వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో భారీగా జనం గుమిగూడటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. గుంపును చెదరగొట్టడానికి కేంద్ర బలగాలు లాఠీఛార్జ్ చేశాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురైనప్పటికీ, భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగింది.

ఈ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సువెందు అధికారికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫల్తా ఘటనపై తక్షణమే స్పందించి, దీనిని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO)ని అమిత్ షా ఆదేశించారు. ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు సువెందు అధికారి తీవ్రంగా స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదాన్ని ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించిందని సువెందు తెలిపారు. ఇది టీఎంసీ ఆడుతున్న డ్రామా అని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇదిలావుంటే రెండోవ, చివరి విడత పోలింగ్ జరుగుతున్న బెంగాల్‌లో మధ్యాహ్నం సమయానికే సుమారు 35% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. అక్కడక్కడా హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఫల్తాలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *