రామసేతువును ఈదుతూ ఐదుగురు మహిళల బృందం అరుదైన రికార్డు సృష్టించింది. హైదరాబాద్, బర్కత్పురాకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా సారథ్యంలో ఈ బృందం శ్రీలంకలోని తలైమినార్ నుంచి తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి వరకు సముద్రాన్ని ఈదింది.
ఇది రికార్డు స్థాయి ప్రయాణం
ఈ ఐదుగురు మహిళల బృందం సుమారు 59 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 10 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసి అద్భుతమైన రికార్డు నెలకొల్పారు ఏప్రిల్ 26 2026న రికార్డ్ సృష్టించారు ఈ ఐదుగురు తల్లులు. వీళ్లంతా అథ్లెట్స్ మాత్రమే కాదు.. పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్న తల్లులు. రామసేతువును ఈదిన తొలి మహిళల బృందంగా వీరు గుర్తింపు పొందారు. ఈ సాహస యాత్ర కేవలం క్రీడ మాత్రమే కాదు. ఒక గొప్ప సామాజిక సందేశంతో కూడుకున్నది. ఈ సందర్భంగా క్వీనీ విక్టోరియా మాట్లాడుతూ.. నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లులుగా తమ ఆవేదనను తెలియజేయడానికే ఈ స్విమ్ అరేంజ్ చేశామని తెలిపారు బృందం సభ్యులు. ఈ సాహసంలో పాల్గొన్న వారిలో తెలంగాణకు చెందిన క్వీనీ విక్టోరియా, మౌనిక, విజయవాడకు చెందిన రాధికతో పాటు ఢిల్లీ, పూణేకు చెందిన మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ స్విమ్ యాత్రకు ‘యూనిఫ్లై అసోసియేషన్’ స్పాన్సర్‌షిప్ అందించింది.