తెలుపు రంగు మాయాజాలం: సైన్స్ ప్రకారం నలుపు రంగు వేడిని పీల్చుకుంటే, తెలుపు రంగు వేడిని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనలో చాలా మంది ఇళ్లపై నలుపు రంగు ప్లాస్టిక్ ట్యాంకులే ఉంటాయి. ఇవి ఎండను త్వరగా గ్రహిస్తాయి. ట్యాంకుపై తెల్లటి కాటన్ బెడ్ షీట్ లేదా టార్పాలిన్ కప్పండి. మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్‌ను ట్యాంకు పైన వేయడం వల్ల కూడా 70శాతం వరకు వేడిని తగ్గించవచ్చు. ఇది సూర్యరశ్మిని అడ్డుకుని ట్యాంక్ వేడెక్కకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
గోనె సంచుల సహజ సిద్ధ కూలింగ్: పాత కాలంలో నీటి కుండల చుట్టూ తడి బట్టలు చుట్టేవారు, అదే సూత్రాన్ని ఇక్కడ వాడాలి. పాత గోనె సంచులను సేకరించి, వాటిని నీటిలో బాగా తడిపి ట్యాంక్ చుట్టూ చుట్టండి. దీనిపై ఒక గట్టి తాడుతో కట్టండి. ఉదయం, మధ్యాహ్నం ఈ సంచులపై కొద్దిగా నీటిని చిలకరిస్తే చాలు.. గాలి తగిలినప్పుడు ఆ నీరు ఆవిరవుతూ, లోపల ఉన్న నీటిని ఐస్‌లా చల్లగా ఉంచుతుంది.
ఇన్సులేషన్.. ఇంటి వద్దే సిద్ధం చేసుకోండి: ఖరీదైన ఇన్సులేషన్ కిట్లు కొనక్కర్లేదు. థర్మోకోల్ లేదా బబుల్ ర్యాప్ అద్భుతంగా పనిచేస్తాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వచ్చే థర్మోకోల్ షీట్లను ట్యాంక్ చుట్టూ అతికించి, దానిపై ప్లాస్టిక్ కవర్ కట్టండి. ఇది బయటి వేడి లోపలికి వెళ్లకుండా థర్మోస్ ఫ్లాస్క్లా పనిచేస్తుంది. దీనివల్ల నీటి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
గ్రీన్ కవర్.. ట్యాంక్ చుట్టూ పచ్చదనం: మీరు గార్డెనింగ్ ఇష్టపడే వారైతే, ఇది మీకు డబుల్ బెనిఫిట్. ట్యాంక్ చుట్టూ ఎత్తుగా పెరిగే మొక్కలను లేదా తీగ జాతి మొక్కలను కుండీల్లో పెంచండి. మొక్కల నీడ ట్యాంకుపై పడటం వల్ల సహజమైన చల్లదనం లభిస్తుంది. అంతేకాకుండా మొక్కల నుంచి వెలువడే తేమ గాలిలోని వేడిని తగ్గిస్తుంది.
పైపుల ఇన్సులేషన్ మర్చిపోకండి: చాలా మంది ట్యాంకును చల్లబరుస్తారు కానీ పైపులను వదిలేస్తారు. పైపుల్లో ఉండే నీరు ఎండకు వేడెక్కి, ట్యాంక్ లోని చల్లటి నీరు బయటకు వచ్చేలోపు మళ్లీ వేడెక్కుతుంది. ట్యాంక్ నుండి బాత్రూమ్ వరకు వచ్చే పైపుల చుట్టూ పాత బట్టలు లేదా ఫోమ్ పైపులను చుట్టండి. దీనివల్ల పైపుల్లో నీరు వేడెక్కదు. మండుతున్న వేసవిలో ఆ నీరు మనకు ఉపశమనాన్ని ఇవ్వాలి కానీ ఇబ్బందిని కాదు. కాబట్టి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..




