హైదరాబాద్‌లో గత కొంత కాలంగా కల్తీ నూనెల తయారీ విచ్చల విడిగా కొనసాగుతోంది. దీంతో H-FAST టీమ్ నకిలీ వంట నూనె విక్రయాలపై భారీ ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. కల్తీ నూనెల విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ ఫుడ్ అనాలసిప్ అండ్ సర్వియలెన్స్ టీమ్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా బేగంబజార్‌లో నూనె వ్యాపారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో సౌత్ జోన్ డీసీపీ గైక్వాడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో విడి నూనె విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నామని, ప్రతి నూనె ప్యాకెట్‌కు తప్పనిసరిగా కంపెనీ సీల్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిల్వ ఉన్న విడి నూనెను విక్రయించుకోవడానికి వ్యాపారులకు 15 రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు తర్వాత ఎవరైనా విడి నూనె విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు DCP గైక్వాడ్. నూనె రిఫైనరీలు, నిల్వ కేంద్రాలలో కచ్చితమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వంట నూనె ప్యాకెట్ కచ్చితంగా సీల్చేసి ఉండాలని.. తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, బ్యాచ్ నంబర్, FSSAI లేబులింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా విడి నూనె విక్రయించినా లేదా కల్తీకి పాల్పడిన వారి వ్యాపార లైసెన్సులను తక్షణమే రద్దు చేయడమే కాకుండా, భారీ జరిమానా,
జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. ప్రజలు కూడా నూనె కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్ సీల్, నాణ్యత పత్రాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..