PM Modi: 300 ఏళ్ల తంతానియా కాళిబారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

PM Modi: 300 ఏళ్ల తంతానియా కాళిబారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..


పశ్చిమ బెంగాల్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్‌షోను ప్రారంభించడానికి ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత పురాతనమైన తంతానియా కాళిబారిని సందర్శించారు. కాళీ మాత ఆశీస్సులు తీసుకున్న మోదీ, బెంగాల్ సంస్కృతితో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. అసలు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి? రామకృష్ణ పరమహంసకు ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నగరం కంటే పురాతనమైన చరిత్ర

కోల్‌కతా నగరం అధికారికంగా అభివృద్ధి చెందకముందే ఈ ఆలయం వెలిసింది. 1703వ సంవత్సరంలో స్థాపించిన ఈ క్షేత్రానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ అమ్మవారిని మా సిద్ధేశ్వరిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ దేవతను జాగ్రత్‌గా భక్తులు విశ్వసిస్తారు.

రామకృష్ణ పరమహంస ఆత్మీయ క్షేత్రం

ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంసకు ఈ ఆలయంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన తరచుగా ఈ ఆలయానికి వచ్చి మా సిద్ధేశ్వరి భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారని చరిత్ర చెబుతోంది. రామకృష్ణులు ఈ ఆలయ ప్రాంగణంలో పఠించిన అమృత వాక్కులు నేటికీ ఆలయ గోడలపై మనకు కనిపిస్తాయి. “శంకరేర్ హృదయ్ మాఝే, కాళీ బిరాజే” అంటే.. శంకరుని హృదయం మధ్యలో కాళీ అమ్మవారు కొలువై ఉన్నారని దీని అర్థం.

ప్రసాదంలో ప్రత్యేకత.. మాంసాహార నైవేద్యం

దేశంలోని చాలా తక్కువ కాళీ దేవాలయాల్లో మాత్రమే మాంసాహార ప్రసాదాన్ని సమర్పిస్తారు. అందులో తంతానియా కాళిబారి ఒకటి. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బ్రహ్మానంద కేశవ చంద్ర సేన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. రామకృష్ణ పరమహంస స్వయంగా దబ్-చింగ్రి(కొబ్బరి బొండంలో వండిన రొయ్యల వంటకం) వంటి నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేశారు. నాటి నుండి నేటి వరకు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం భక్తులు ఇక్కడ మాంసాహార ప్రసాదాన్ని సమర్పించే ఆచారం కొనసాగుతోంది. రామకృష్ణ పరమహంస స్వయంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఆయన అనుచరులు ఇదే విధంగా మొక్కులు తీర్చుకున్నారని ఇక్కడి పూజారులు చెబుతారు.

మోదీ పర్యటన ప్రాధాన్యత

రోడ్‌షోకు ముందు ప్రధాని మోదీ ఇక్కడ పూజలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెంగాలీ ప్రజల ఆరాధ్య దైవమైన కాళీ మాతా ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మోదీ అక్కడి ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మతువా ఆలయంలో మోదీ ప్రార్థనలు

అదేవిధంగా ప్రధాని మోదీ మతువా ఆలయాన్ని సందర్శించారు. మతువా మహాసంఘ్‌కు మాతృమూర్తిగా పిలవబడే బోరో మా బినపాని ఠాకూర్‌తో ప్రధానికి ప్రత్యేకమైన గౌరవప్రదమైన అనుబంధం ఉంది. 2019లో ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వయంగా సందర్శించి ఆశీస్సులు తీసుకోవడం, ఆ తర్వాత ఆమె మరణించినప్పుడు ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం మోదీకి ఆ కుటుంబం పట్ల ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పాయి. హరిచంద్ ఠాకూర్, గురుచంద్ ఠాకూర్ బోధించిన మానవతావాదం, సమానత్వం పట్ల తనకున్న గౌరవాన్ని ప్రధాని తరచుగా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *