తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం చేశారు. దాదాపు 10 వేల బస్సులను నిలిపివేసిన కార్మికులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారు. కరీంనగర్ పరిధిలోని డిపోల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం అధికారులు అద్దె ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కామారెడ్డి డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల పహారా నడుమ అద్దె బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా చేశారు. బీఆర్టీయూ, బీఆర్ఎస్వీ నాయకులు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు.సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. గోదావరిఖని, హుస్నాబాద్, నిజామాబాద్ వంటి పలు జిల్లాల్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమ్మె చురుకుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అద్దె బస్సులు పాక్షికంగా నడిచినా, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు ప్రాంతాలలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేటు బస్సులను ఆర్టీసీ అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడిపించారు. జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు పెంచడంతో పలు చోట్ల వాహనదారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. సమ్మెతో ప్రజారవాణా స్తంభించిపోవడంతో మహిళలు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడ్డారు. తమ డిమాండ్లపై హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. మరోవైపు గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో సీనియర్ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహంతో నిరసన కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన బాట పట్టారు. అంతకు మందు తోటి ఉద్యోగులతో కలిసి ఉదయం డిపో ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొన్న శంకర్‌గౌడ్, తర్వాత ఇంటికెళ్లి ఖాకీ దుస్తులు వేసుకొని కొద్ది సమయం తర్వాత బస్టాండ్‌కు వచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు కొందరు డిపో ఎదుట చెట్టునీడన ఉండగా, ఇంకొందరు బస్టాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బైక్ పార్కింగ్ వైపు ద్వారం నుంచి బస్టాండ్ లోపలికి వచ్చిన శంకర్ గౌడ్ కార్గో కార్యాలయం దగ్గర ఒంటిపై పెట్రోల్ చల్లుకొని ఒక్కసారిగా నిప్పంటించుకున్నారు. మంటలకు కేకలు వేస్తూ అక్కడి నుంచి బస్టాండ్‌లోకి వస్తుండగా అది చూసిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, విధుల్లో ఉన్న పోలీసులు హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేశారు. శంకర్ గౌడ్ ను తొలుత నర్సంపేట ఆసుపత్రికి, తర్వాత వరంగల్ ఎంజీఎంకు అంబులెన్సులో తరలించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్‌సింగ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో గొంతులో వాపు పెరిగి శంకర్‌గౌడ్ మాట్లాడటం ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు మరణ వాంగ్మూలం కోసం ప్రయత్నాలు ఆపేసి చికిత్స కొనసాగించారు. అనంతరం వెంటిలేటర్ అమర్చి హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. 85 నుంచి 95 శాతం మేరకు తీవ్రంగా కాలిన గాయాలకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా శంకర్ గౌడ్ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు ఆసుపత్రిలో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. శంకర్ గౌడ్ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే కార్మికులు ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని తెలిపారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. డ్రైవర్ మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కార్మిక సంఘం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు సమావేశం కానున్నారు. వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లు, వాటికి పరిష్కారాలు, సమ్మె పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు తెలిపారు. ‘‘ఆర్టీసీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాం. పీఆర్సీ, ఉద్యోగుల విలీనం, సంఘాలకు గుర్తింపుపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కార్మికులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు’’ అని వారు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని ముత్తోజిపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లి నిరసన తెలపాలన్న కార్మికుల నిర్ణయాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికుల మధ్య భారీ వాగ్వాదం జరగ్గా పోలీసుల వాహనం ధ్వంసమైంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేసింది. అతని కుమారుడికి ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. శుక్రవారం ఉదయం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగా తొలుత ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ కానున్నారు. అనంతరం మంత్రుల బృందంతో ఈ నేతలు సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు మొత్తం 32 డిమాండ్లు ప్రభుత్వం ఎదుట ఉంచగా, వాటిలో 29 సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రెండు పీఆర్సీలు, ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల నిర్వహణ వంటి మూడు కీలక డిమాండ్లపై నేడు స్పష్టత రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
ఆధార్ నెంబర్ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??
Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం