Tirumala: రూ.300 టికెట్లు దొరక్కపోయినా శ్రీవారిని దర్శించుకోవచ్చు.. భక్తులకు టీటీడీ మరో అవకాశం..

Tirumala: రూ.300 టికెట్లు దొరక్కపోయినా శ్రీవారిని దర్శించుకోవచ్చు.. భక్తులకు టీటీడీ మరో అవకాశం..


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరచూ లక్షలాది మంది కొండపైకి వెళ్తుంటారు. కానీ దర్శనం టికెట్లు దొరక్క గంటల కొద్ది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇక ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లను ముందుగానే బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తారు. అయితే ఈ టికెట్లను రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ విడుదల చేయగానే సెకన్లలోనే టికెట్లన్నీ బుక్ అయిపోతాయి. దీంతో చాలామందికి రూ.300 టికెట్లు దొరక్క శ్రీవారిని ఎలా దర్శించుకోవాలని మదనపడుతూ ఉంటారు. అలాంటి వారికి టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. అదే దివ్యానుగ్రహ హోమం. ఈ హోమంలో పాల్గొన్నవారికి టీటీడీ రూ.300 దర్శనం కల్పిస్తోంది.

ప్రతీ నెలా ఆన్‌లైన్‌లో టికెట్లు

టీటీడీ ఏప్రిల్ 25వ తేదీన దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. దీంతో టీటీడీ వెబ్‌సైట్లోకి వెళ్లి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ల ధర రూ. 1600 ఉంటుంది. ఈ టికెట్‌పై ఇద్దరు హోమంలో పాల్గొనవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో ఈ హోమం జరగనుంది. హోమం ప్రతిరోజు జరుగుతుంది. హోమం ముగిశాక మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇద్దరికి ఈ అవకాశం ఉంటుంది. మే నెల కోటా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను రేపు టీటీడీ విడుదల చేస్తోంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను రిలీజ్ చేస్తున్నారు. దీంతో రూ.300 దర్శనం టికెట్లు దొరకనివారు ఈ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.

మూడు రోజుల పాటు ఉత్సవాలు

దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ప్రతీ నెలా ఆన్ లైన్‌లో జారీ చేస్తారు. వచ్చే నెల కోటా టికెట్లను ముందు నెలలో రిలీజ్ చేస్తారు. చాలామందికి దీని గురించి తెలియక ఈ సదుపాయాన్ని ఉపయోగించలేకపోతున్నారు. దీంతో టీటీడీ అవగాహన కల్పిస్తోంది. అటు ఏప్రిల్ 25 నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను తిరుమలలో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు వేడుకల్లో శ్రీ మలయప్పస్వామి గజవాహనంపై విహరించనుండగా.. రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుణవాహనంపై వేంచేపు చేస్తారు. అనంతరం కళ్యాణమహోత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకలను చూసేందుకు తిరుమలకు భారీగా భక్తులు తరలిరానున్నారు. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *