Rohit Sharma : హిట్‌మ్యాన్ పని అయిపోయిందా? మాజీ స్టార్ ప్లేయర్ వ్యాఖ్యలతో క్రికెట్ లోకంలో ప్రకంపనలు

Rohit Sharma : హిట్‌మ్యాన్ పని అయిపోయిందా? మాజీ స్టార్ ప్లేయర్ వ్యాఖ్యలతో క్రికెట్ లోకంలో ప్రకంపనలు


Rohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవైపు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోతుంటే, మరోవైపు జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గైర్హాజరీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా రోహిత్ బరిలోకి దిగకపోవడంతో, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందని వీరూ కుండబద్ధలు కొట్టారు.

ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ అనంతరం క్రిక్ బజ్ చర్చలో పాల్గొన్న సెహ్వాగ్, రోహిత్ శర్మ గత 10 ఏళ్ల ఐపీఎల్ గణాంకాలను బయటకు తీశారు. “గత పదేళ్లలో రోహిత్ కేవలం ఒక్కసారి మాత్రమే 400 పరుగుల మార్కును దాటాడు. అతను 500 లేదా 700 పరుగులు చేయాలని అనుకునే ఆటగాడు కాకపోవచ్చు. కానీ జట్టు కోసం త్యాగాలు చేస్తున్నాననే సాకుతో పరుగులు చేయకపోతే అది అతని వ్యక్తిగత రికార్డు పై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అతను వెళ్లాల్సిన సమయం వచ్చేసింది” అని వీరూ వ్యాఖ్యానించారు.

రిటైర్మెంట్ అనేది గౌరవప్రదంగా ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అభిమానులు ఇంకా ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారు? ఎందుకు డ్రాప్ చేయడం లేదు? అని ప్రశ్నించే వరకు రోహిత్ వెయిట్ చేయకూడదు. ఆ పరిస్థితి రాకముందే, ఫ్యాన్స్ గుర్తుంచుకునేలా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తప్పుకోవాలని హితవు పలికారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో అతని ప్రాధాన్యత తగ్గుతోందనే వార్తలకు సెహ్వాగ్ మాటలు మరింత ఆజ్యం పోశాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుస ఓటములతో కుదేలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ముంబైకి ప్లే ఆఫ్స్ చేరడం గగనంగా మారింది. రోహిత్ ఎప్పుడు జట్టులోకి తిరిగి వస్తాడనే దానిపై స్పష్టత లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర ఒత్తిడి ఉండటం, టీమ్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే పుకార్లు జట్టు ప్రదర్శనను దెబ్బతీస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రోహిత్ మరిన్ని మ్యాచ్‌లకు దూరమైతే, సెహ్వాగ్ అన్నట్లుగా అతని ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, రోహిత్ అభిమానులు మాత్రం తమ హీరో ఫామ్‌లోకి వచ్చి విమర్శకుల నోళ్లు మూయిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *