భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ ఆమె. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు అప్పట్లో ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. అయితే గత కొన్నేళ్లుగా ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ఆ హీరోయిన్ సుమారు 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
కన్నడ పీరియడ్ యాక్షన్ డ్రామా 'మ్యాక్స్' (Max) ద్వారా ఆమె మళ్లీ సౌత్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ఇప్పటికే పాల్గొన్నట్లు తెలుస్తోంది. కేవలం కన్నడలోనే కాకుండా, ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో టబు పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఆమె విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే.
టబు తెలుగులో వెంకటేశ్ సరసన 'కూలీ నంబర్ 1', నాగార్జున జోడిగా 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మా ఆవిడే' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో సైతం నటించింది. ఆమె చివరిగా తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఆమె సౌత్ వైపు చూడలేదు. ఇప్పుడు సుదీప్ సినిమాతో కన్నడలోకి అడుగుపెడుతుండటం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రస్తుతం టబు తన వయసుకి తగ్గట్టుగా విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే హిందీలో 'భూల్ భూలయ్యా 2', 'దృశ్యం 2', 'క్రూ' వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆమె, ఇప్పుడు సౌత్ లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. 'మ్యాక్స్' సినిమాతో పాటు మరికొన్ని తమిళ, తెలుగు ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. ఆమె విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా హిందీ, ప్రాంతీయ చిత్రసీమలో విజయం సాధించారు. 'హమ్ నౌజవాన్' చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టి, ఆమె తెలుగు చిత్రం 'కూలీ నెం. 1'లో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె మాచీస్, చాందినీ బార్, హైదర్, అంధాధున్, దృశ్యం 2 వంటి అనేక చిత్రాలలో ప్రశంసలు పొందిన పాత్రలను పోషించారు. ఆమె రెండు జాతీయ అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 2011లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.




