Puri Jagannadh : రోడ్డు మీద పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగండి.. ఏం చెప్పాడు భయ్యా.. పూరి చెప్పిన ఈ మాటలు విన్నారా.. ?

Puri Jagannadh : రోడ్డు మీద పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగండి.. ఏం చెప్పాడు భయ్యా.. పూరి చెప్పిన ఈ మాటలు విన్నారా.. ?


డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తన మనసులోని మాటలను పూరి మ్యూజింగ్స్ పేరుతో రివీల్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన పూరి.. ఇప్పుడు మరోసారి పూరి మ్యూజింగ్స్ ద్వారా తన ఆలోచనలను మాటల రూపంలో తీసుకుచ్చారు. ఈసారి రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగి వాటిని చూడమంటున్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. “రోడ్డు పక్కన చాపల మీద, పెట్టెల మీద లేదా నేల మీద పెట్టి పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. వాటి కవర్లు రంగు కోల్పోయి, పేజీలు పసుపు రంగులోకి మారి ఉంటాయి. అవి కేవలం పుస్తకాలు కావు; కాలాన్ని దాటుకొని వచ్చిన కథలు. రోడ్డు పక్కన ఉన్న పుస్తకాల దుకాణాల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వాటికి గ్లాస్ డోర్స్‌ ఉండవు, ఎయిర్ కండిషనింగ్ ఉండదు, కేవలం ఆకాశం కింద మీ కోసం ఎదురు చూస్తున్న పాత జ్ఞాపకాలు అవి. అక్కడ ఉన్న ప్రతి పుస్తకంలో ఒక జీవితం నిక్షిప్తమై ఉంటుంది.

ఈ పుస్తకాలు అమ్మే వాళ్లు చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ వారికి ప్రతి పుస్తకం గురించి ఒక జ్ఞాపకం ఉంటుంది. మీరు ఒక పుస్తకం గురించి అడిగితే, వాళ్లు కేవలం ధర మాత్రమే చెప్పరు. ఆ పుస్తకం ఎక్కడి నుండి వచ్చిందో కూడా చెబుతారు. “ఇది ఒక విద్యార్థి వాడింది,” లేదా “ఇది ఒకప్పుడు లైబ్రరీలో ఉండేది,” “ఈ పుస్తకం అమ్మేసి ఆయన లండన్ వెళ్ళిపోయాడు” వంటి అనేక మెమొరీస్ వారికి ఉంటాయి. ఇలాంటి పాత పుస్తకాలు కొనడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కొత్త పుస్తకాల్లో కనిపించిన అనేక విషయాలు ఇందులో ఉంటాయి. పుస్తకం తెరిస్తే, మొదటి పేజీలో ఎవరో రాసిన పేరు, మధ్యలో పెట్టి మర్చిపోయిన పాత రైల్వే టికెట్, గీతలు పెట్టిన కొన్ని వాక్యాలు, పక్కన పెన్నుతో రాసిన చిన్న నోట్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి పుస్తకం కొన్నాక, ఆ పుస్తకాన్ని ముందుగా చదివిన వ్యక్తి గురించి ఆలోచన వస్తుంది. వారు సంతోషంగా ఉన్నారా? ఈ పుస్తకం వారికి ఓదార్పు ఇచ్చిందా? చదివి పూర్తి చేశారా? ఇవి మనసును తాకే ప్రశ్నలు.

ఖరీదైన పుస్తకాలు కొనలేని విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. చిన్న డబ్బుతో పెద్ద ప్రపంచాన్ని అందిస్తాయి. ఈ పుస్తకాలు అమ్మే వాళ్లు చాలా గొప్ప వాళ్లు. వేడి, దుమ్ము, శబ్దాల మధ్య రోజంతా కూర్చుని పుస్తకాలు అమ్ముతారు. వాళ్లు కేవలం పుస్తకాలు అమ్మడం కాదు, కథలను కాపాడుతున్నారు. మర్చిపోయే పుస్తకాలకు ఒక కొత్త జీవితం ఇస్తున్నారు. ఈ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ వల్ల ఇలాంటి పుస్తకాల దుకాణాలు తగ్గిపోతున్నాయి. ఒక్కోసారి మీరు వెతుకుతున్న పుస్తకం కాకుండా, మీకు అవసరమైన పుస్తకం అక్కడ దొరకొచ్చు. పుస్తకాలు అన్నీ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. పాత వాటిలో మీకు తెలియనివి ఎన్నో విషయాలు ఉంటాయి. ఈసారి మీరు రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగండి. ఎందుకంటే ఆ పుస్తకాన్ని ఎవరో మనసు పెట్టి రాశారు. ఇంకెవరో మనసు పెట్టి చదివారు. మరో వ్యక్తి అందులో కొన్ని వాక్యాల్ని అండర్ లైన్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం మీ కోసం ఎదురు చూస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, అదే పుస్తకం మీ జీవితాన్ని మార్చి రావచ్చు.

పారిస్ లో, నోట్రే-డామ్ కెథడ్రల్ పక్కన “బొకినిస్ట్ ఆఫ్ ది సేన్” అని ఒక ప్రాంతం ఉంది. ఆ సేన్ రివర్ కు ఇరువైపులా ఎన్నో బుక్ స్టాల్స్ పెట్టి పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. 16వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది బుక్ సెల్లర్స్ అక్కడ పాత పుస్తకాలు అమ్ముతూనే ఉన్నారు. మీరు వెళ్తే అక్కడ ఓల్డ్ అండ్ రేర్ బుక్స్, వింటేజ్ పోస్ట్ కార్డులు, ప్రింట్స్, యాంటిక్ మ్యాప్స్, క్లాసిక్ ఫ్రెంచ్ లిటరేచర్ దొరుకుతాయి. రోజూ అక్కడ ఎంతోమంది కాఫీ షాపుల్లో కూర్చుని, కాఫీ తాగుతూ ఆ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. పారిస్ లో ఉన్న పొయెట్స్, మ్యూజిషియన్స్, స్టూడెంట్స్, యాక్టర్స్ అందరూ సాయంత్రం పూట కలుసుకునే ప్రదేశం అది. ఎప్పుడైనా మీరు పారిస్ వెళ్తే ఈ పోయెటిక్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడ ప్రతి పుస్తకం ఒక జీవితాన్ని గడిపినవే. అవి వయసు మీ కంటే ఎక్కువే ఉండొచ్చు. వృద్ధాప్యంలో కూడా అవి మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. మీ కోసం ఎదురు చూస్తూ ఆ నది పక్కన ఇంకా ఉన్నాయి. వీలైతే వెళ్లి ఒకసారి వాటిని పలకరించండి” అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *