Rohit Sharma : భారత క్రికెట్ చరిత్రలో 2011 ప్రపంచకప్ విజయం అనేది ఇప్పటికీ ఒక మధుర జ్ఞాపకం. కానీ, ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ లేకపోవడం ఇప్పటికీ ఆయన అభిమానులను బాధిస్తూనే ఉంటుంది. దీనిపై తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “రోహిత్.. ఐ యామ్ సారీ బాస్! నిన్ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. అది కేవలం టీమ్ కాంబినేషన్ కోసం తీసుకున్న నిర్ణయం” అని రోహిత్‌తో అన్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
2011 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసేటప్పుడు సెలెక్టర్లు మల్టీ డైమెన్షనల్ ప్లేయర్లకు అంటే ఆల్ రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని శ్రీకాంత్ వివరించారు. 1983 వరల్డ్ కప్ వ్యూహాన్నే అప్పుడు కూడా అమలు చేశామని, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే ఆటగాళ్లు కావాలని భావించామన్నారు. అందుకే యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, రైనా వంటి వారిని ఎంపిక చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలోనే రోహిత్ శర్మకు చోటు దక్కలేదని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి ఆ సమయంలో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతను జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని శ్రీకాంత్ అంగీకరించారు. “పాపం ఆ కుర్రాడు మిస్ అయ్యాడు, ఈ రోజుకీ ఆ విషయం నన్ను బాధపెడుతోంది” అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ బంతి వృక్షంగా మారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడంతో తమ వ్యూహం ఫలించినట్లు అనిపించినా, రోహిత్ వంటి ప్రతిభావంతుడిని దూరం చేసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
రోహిత్ శర్మ ఇప్పటికే తన కెరీర్లో రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2013, 2025) గెలిచినప్పటికీ, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవాలన్నది అతని చిరకాల కోరిక. 2023లో కెప్టెన్‌గా భారత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లినా, దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాడు. శ్రీకాంత్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..