IPL 2026 LSG vs RR : ఐపీఎల్ 2026 సీజన్ 32వ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) , రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి ఏకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఏకానా పిచ్ సాధారణంగా స్లోగా ఉండటం, మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో చేజింగ్ సులభం అవుతుందని పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాయింట్ల పట్టికను గమనిస్తే రెండు జట్లు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా ప్రారంభించింది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్ళీ ఫామ్‌లోకి రావాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోవైపు లక్నో పరిస్థితి దయనీయంగా ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచిన రిషబ్ పంత్ సేన, ప్రస్తుతం వరుసగా మూడు ఓటములతో 9వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.
పిచ్ రిపోర్ట్ ప్రకారం ఏకానా స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. బంతి గ్రిప్ దొరికి టర్న్ అయ్యే అవకాశం ఉన్నందున బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారవచ్చు. ఇక్కడి సగటు స్కోరు 173 పరుగులు మాత్రమే. కాబట్టి 180 కంటే ఎక్కువ స్కోరు చేస్తే రాజస్థాన్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లక్నో జట్టులో మహమ్మద్ షమీ, ఎన్రిక్ నోర్కియా వంటి వేగవత్తమైన బౌలర్లు ఉన్నప్పటికీ, జట్టు సమన్వయం కుదరకపోవడం వల్ల వరుస ఓటములను చవిచూస్తోంది.
రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, శిమ్రాన్ హెట్మెయర్ వంటి హిట్టర్లతో పాటు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే లక్నోకు ఈ విజయం అత్యవసరం కాగా, అగ్రస్థానం దిశగా వెళ్లాలంటే రాజస్థాన్‌కు ఈ రెండు పాయింట్లు చాలా ముఖ్యం.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నంద్రే బుర్గర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..