పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెలికితీయగా కళ్ళు జిగేల్

పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెలికితీయగా కళ్ళు జిగేల్


పురాతన ఈజిప్టు నాగరికత అంటేనే అంతుచిక్కని రహస్యాల నిలయం. పిరమిడ్లు, మమ్మీలు మాత్రమే కాకుండా, వారు అనుసరించిన వింత ఆచారాలు నేటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా, అక్కడి ఆక్సిరిన్చస్(Oxyrhynchus) గా పిలువబడే నేటి ఎల్ బహ్నాసా ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో రోమన్ యుగానికి చెందిన విలక్షణమైన సమాధులు, అంత్యక్రియల ఆచారాలు వెలుగుచూశాయి. ఈ సమాధుల్లోని అనేక మమ్మీల నోటిలో చిన్న బంగారు రేకులతో చేసిన నాలుకలు అమర్చి ఉన్నాయి. ఒక మమ్మీ నోటిలో రాగి నాలుక కూడా కనిపించింది. పురాతన ఈజిప్షియన్లు, రోమన్లు మరణం తర్వాత ఆత్మలు దేవతల ఎదుట మాట్లాడాల్సి ఉంటుందని, ఆ సమయంలో వారి అసలు నాలుకలు పాడైపోయినా ఈ బంగారు నాలుకలు వారికి వాక్ శక్తిని ఇస్తాయని నమ్మేవారు.

ఈ తవ్వకాల్లో లభించిన అత్యంత విలువైన చారిత్రక సాక్ష్యం ఒక పాపిరస్ కాగితం. ఇది ఒక మమ్మీ లోపల భద్రపరచబడింది. దీనిపై హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీకు కావ్యం ఇలియాడ్ (Book Two) లోని కొన్ని భాగాలు ఉన్నాయి. గ్రీకు, రోమన్ సంస్కృతులు ఈజిప్టులో ఎంతగా ప్రాచుర్యం పొందాయో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ కేవలం మమ్మీలే కాకుండా, కాల్చిన మృతదేహాల అవశేషాలు (Cremated remains) కూడా లభించాయి. ఒక సున్నపురాయి గదిలో మట్టి పాత్రల్లో భద్రపరిచిన పెద్దల, శిశువుల ఎముకలు, జంతువుల అవశేషాలు కూడా దొరికాయి. ఇది ఆనాటి సమాజంలో ఉన్న వివిధ రకాల మతపరమైన ఆచారాలను సూచిస్తుంది.

తవ్వకాల్లో టెర్రకోట, కాంస్యంతో చేసిన చిన్న విగ్రహాలు లభించాయి. వీటిలో హార్పోక్రటీస్ (Harpocrates – నిశ్శబ్దానికి దేవత), క్యూపిడ్ వంటి దేవతల రూపాలు ఉన్నాయి. ఇవి ఈజిప్షియన్, గ్రీకో-రోమన్ దైవ నమ్మకాల మిశ్రమాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగారం అనేది దేవతల మాంసంగా వారు భావించేవారు. అది ఎప్పటికీ తుప్పు పట్టదు లేదా పాడవదు. అందుకే ఆత్మల ప్రయాణం అనంతంగా సాగడానికి బంగారాన్ని ఉపయోగించేవారు. ఎల్ బహ్నాసాలో దొరికిన ఈ అవశేషాలు ప్రాచీన నాగరికతలు మరణాన్ని ఎలా గౌరవించేవారో, పరలోక ప్రయాణం కోసం వారు చేసిన ఏర్పాట్లను కళ్లకు కడుతున్నాయి. లూటీల వల్ల కొన్ని సమాధులు దెబ్బతిన్నప్పటికీ, మిగిలిన అవశేషాలు చరిత్రకారులకు అపురూపమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *