మంచి జీతం వస్తే ఆర్థికంగా స్థిరపడతామని చాలా మంది భావిస్తారు. కానీ అధిక ఆదాయం సంపాదించడం ఒక్కటే సరిపోదని, సంపదను సృష్టించడానికి సరైన ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయెల్ స్పష్టం చేశారు. ఆమె విశ్లేషణ ప్రకారం నేటి యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌గా మారింది. నెలకు రూ.1.2 లక్షల వరకు జీతం ఉన్నప్పటికీ, చాలా మంది నెలాఖరులో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆదాయం పెరిగే కొద్దీ జీవనశైలి కూడా తెలియకుండానే పెరుగుతుంది. దీనినే ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అని అంటారు. ఉదాహరణకు ఒక సగటు ఉద్యోగి ఖర్చులను పరిశీలిస్తే, ఇంటి అద్దెకు సుమారు రూ.35 వేల వరకు, ఈఎంఐలకు మరో రూ.30 వేల వరకు వెళ్తుంది. అదనంగా విలాసవంతమైన ఖర్చులు రూ.20 వేలకుపైగా ఉండగా, నిత్యావసరాలు, బిల్లులు మరో రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చవుతాయి. ఈ విధంగా నెల ప్రారంభంలోనే దాదాపు రూ.1 లక్షకు పైగా ఖర్చులు కట్టుబడి పోతాయి. చివరికి మిగిలే చిన్న మొత్తాన్ని సేవింగ్స్‌గా భావించడం పెద్ద తప్పు అని ఆమె హెచ్చరిస్తున్నారు.
ఖర్చులు పూర్తయ్యాక మిగిలినదాన్ని సేవ్ చేస్తే సంపద సృష్టించలేరు. ముందుగా సేవింగ్స్, తర్వాత ఖర్చులు అనే ఆలోచనతో ముందుకు వెళ్లాలి అని మీనల్ గోయెల్ సూచిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆదాయం – పొదుపు = ఖర్చులు అనే సూత్రాన్ని పాటించడం అత్యంత అవసరం. అంటే జీతం వచ్చిన వెంటనే ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడిగా మళ్లించి, మిగిలిన దానితో జీవనశైలిని నిర్వహించుకోవాలి.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. నెటిజన్లు కేవలం ఖర్చులు తగ్గించడం మాత్రమే కాకుండా, ఆదాయ మార్గాలను పెంచుకోవడం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. సంపాదన పెరిగినప్పుడే విలాసవంతమైన ఖర్చులకు లొంగకుండా, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడిగా మళ్లిస్తేనే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి