మరోసారి కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. ఇదో ఒక కుట్ర అంటున్న ఇరాన్..!

మరోసారి కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్..  ఇదో ఒక కుట్ర అంటున్న ఇరాన్..!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తాత్కాలికంగా చల్లబరుస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను (Ceasefire) పొడిగిస్తున్నట్లు ఆయన మంగళవారం (ఏప్రిల్ 21) ప్రకటించారు. చర్చల ప్రక్రియకు ఇరాన్‌కు మరికొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ల ప్రత్యేక అభ్యర్థన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం రెండుగా చీలిపోయిందని, ఒక ఉమ్మడి ప్రతిపాదనతో చర్చలకు రావడానికి వారికి కొంత గడువు అవసరమని పాక్ నేతలు ట్రంప్‌ను కోరారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. “ఇరాన్ ప్రభుత్వం తీవ్ర గందరగోళంలో ఉంది. పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షరీఫ్‌ల కోరిక మేరకు, ఇరాన్ ఒక ఏకీకృత నిర్ణయానికి వచ్చేలా దాడులను నిలిపివేయమని ఆదేశించాను. అయితే, ఇరాన్ తీరాలపై దిగ్బంధనం కొనసాగుతుంది” అని ట్రంప్ తన పోస్ట్‌లో వివరించారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేపట్టాల్సిన పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం ఈ పర్యటన ఖరారైనప్పటికీ, అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో దీనిని ప్రస్తుతానికి నిలిపివేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ పొడిగింపు అనేది ఇరాన్‌పై అకస్మాత్తుగా దాడి చేయడానికి అమెరికా పన్నుతున్న వ్యూహాత్మక కుట్ర అని ఆయన ఆరోపించారు. ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనం బాంబు దాడితో సమానమని ఇరాన్ మండిపడింది. దీనికి సైనిక చర్య ద్వారానే సమాధానం చెబుతామని హెచ్చరించింది. ఓడిపోతున్న పక్షం షరతులు విధించడమేంటని, ట్రంప్ చర్యలు అర్థరహితమని ఇరాన్ వ్యాఖ్యానించింది.

ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇది ఏప్రిల్ 22తో ముగియాల్సి ఉండగా, ట్రంప్ దీనిని పొడిగించారు. ఇస్లామాబాద్‌ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇరు దేశాల మధ్య నమ్మకం కొరవడటంతో ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు నిలుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *